ETV Bharat / state

ఉగాది నాటికి జగనన్న ఇళ్లు పూర్తయ్యేనా?

author img

By

Published : Mar 13, 2023, 5:05 PM IST

Jagananna Houses
జగనన్న ఇళ్లు

Jagananna Houses Condition: జగనన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిర్మాణాలు మాత్రం నత్తనడకనే కొనసాగుతున్నాయి. దీనికితోడు రహదారులు, వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని స్థానికులు అంటున్నారు.

Jagananna Houses Condition: బాపట్ల జిల్లాలో బొమ్మనంపాడు వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీలో సుమారు 650 నుంచి 700 వరకు లబ్ధిదారులున్నారు. నిర్మాణాలు మాత్రం అరకొరగానే జరుగుతున్నాయి. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని చెబుతున్నారు. కానీ వసతులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా సౌకర్యం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతర రహదారులు కూడా సక్రమంగా లేవు. ఒక్కో ఇల్లు పునాదులు దగ్గరే కుంగిపోయి పాడైన పరిస్థితులు కనపడుతున్నాయి.

అధికారుల ఉరుకులు పరుగులు.. ఉగాదికి జగనన్న ఇళ్లు పూర్తయ్యేనా?

అద్దంకి అర్బన్ పరిధిలో మూడు చోట్ల జగనన్న లేఅవుట్​లను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం జగనన్న గృహ సందర్శన కార్యక్రమంలో భాగంగా అద్దంకి అర్బన్ పరిధిలో బొమ్మనంపాడు గ్రామానికి దగ్గరలో నిర్మిస్తున్న లేఅవుట్​ను తహసీల్దార్ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే మీకు రావాల్సిన బిల్లులు కూడా సకాలంలో అందుతాయని తెలిపారు. ఒక్కోచోట సుమారు 1000కి పైగా ఇళ్లను నిర్మిస్తున్నట్లు మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలిపారు.

కాంట్రాక్టర్ చేతిలో: ఓ కాంట్రాక్టర్​కి సుమారు 49 ఇళ్ల వరకు నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారు. కానీ సదరు కాంట్రాక్టర్ మాత్రం ఇప్పటివరకు 23 ఇళ్లకు మాత్రమే పునాదులు వేశాడు. కాంట్రాక్టరుకు 49 ఇళ్ల మీద సుమారు కోటి రూపాయల పైన బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు.. కాంట్రాక్టర్ ఏం చేస్తున్నట్లు అని అధికారులు.. కింది స్థాయి సిబ్బంది​పై చిర్రుబుర్రులాడుతున్నారు. ఉగాది నాటికి జగనన్న ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తారో లేదో అనే సందేహంగా ఉందని స్థానికులు అంటున్నారు.

లబ్ధిదారుల ఆవేదన: ప్రభుత్వం ద్వారా వచ్చే లక్షా 80 వేల రూపాయలు పునాదులు వేయటానికే సరిపోతున్నాయి. అక్కడ నుంచి మిగతా పనులను పూర్తి చేయడానికి లబ్ధిదారుడే భారం మోయాల్సి వస్తుందని బయటకు చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే చాలా కష్టంగా ఉందటున్నారు. లేఅవుట్​కి ఇచ్చిన భూమి నల్లరేగడి నేల కావటం చేత ఇంటి ఫౌండేషన్​కే ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి అధికారులు మాత్రం జగనన్న ఇళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మాత్రం పరుగులు తీస్తున్నారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పేదవాడికీ ఇంటిని నిర్మించుకోవడానికి లక్షా 80 వేలు ఇస్తోంది. అది సరిపోకపోతే అదనంగా 35 వేల రూపాయల రుణం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని జగనన్న కాలనీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అద్దంకి అర్బన్ పరిధిలో మూడు చోట్ల జగనన్న లేఅవుట్​ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో.. ఒక్కో లేఅవుట్​లో 1000కి పైగా ప్లాట్లు ఏర్పడి ఉన్నాయి. వీటి ద్వారా మూడు ఊర్లు ఏర్పడినట్లు అవుతుంది. ఉగాది టార్గెట్ అందుకోవడానికి.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది". - సుబ్బారెడ్డి, అద్దంకి మండల తహసీల్దార్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.