ETV Bharat / state

బాధితుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలి - అధికారులతో సీఎం జగన్‌

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 5:17 PM IST

Michaung cycloneyclone
Michaung cyclone

Michaung cyclone affected districts in AP: మిగ్​జాం తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయ చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని నిర్దేశించారు. పునరావాస క్యాంపుల్లో అన్ని వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

మిగ్​జాం తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ - ప్రత్యేకాధికారుల నియామకం

Michaung Cyclone Affected Districts in AP: రాష్ట్రంపై తుపాను ప్రభావితం ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్​ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను యుద్ద ప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను జగన్ ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబానికి పరిహారం మరో 500 రూపాయలు పెంచి 2500 రూపాయల చొప్పున ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయాలని జగన్ పేర్కొన్నారు.

విస్తరించిన మిచౌంగ్​ తుపాన్​ - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది

CM Jagan Review on Cyclone: గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు: తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు,ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తుపాను దృష్ట్యా చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలని సీఎం నిర్దేశించారు. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారని, అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీయడం సహా వర్షాలు కురుస్తాయని సీఎం తెలిపారు. జిల్లాల కలెక్టర్లు అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తిరుపతికి రూ. 2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో 1 కోటి చొప్పున ఇచ్చారని, మిగిలిన జిల్లాలకు కూడా మరో కోటి రూపాయలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

CM Jagan Suggestions to Officials: తగిన జాగ్రత్తలు: ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించామని సీఎం జగన్ వెల్లడించారు. వీరంతా జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి కలెక్టర్, ఎస్పీ దీన్నొక సవాలుగా తీసుకుని పని చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగడానికి వీలు లేదన్నారు. మనుషులతో పాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదని, ఈ మేరకు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని నిర్దేశించారు. ఖరీప్‌ పంటల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ధాన్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్నారు. కోతకు వచ్చిన ఖరీప్‌ పంట కాపాడుకోవాలని, ఇప్పటికే 97 వేల టన్నులు సేకరించినట్లు తెలిపారు. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కోసిన పంటను కచ్చితంగా సేకరించాలని, తేమ ఉన్న ధాన్యం అయినా, రంగు మారిన ధాన్యాన్నైనా కచ్చితంగా సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని నిర్దేశించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం సేకరించాలన్నారు.

మరో 500 పెంచుతూ నిర్ణయం: తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వారిని సురక్షత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇప్పటికే 181 సహాయ పునరావాస కేంద్రాలను 8 జిల్లాల్లో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. మొత్తంగా 308 సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటుకు గుర్తించామని అధికారులు సీఎంకు చెప్పారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని అక్కడికి తరలించాలని సీఎం జగన్ సూచించారు. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ 1000 రూపాయలు చొప్పున ఇవ్వాలని, కుటుంబానికైతే గతంలో మాదిరిగా కాకుండా మరో 500 పెంచి 2500 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున అందించాలని సీఎం నిర్దేశించారు.

తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలు వల్ల దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారికి తక్షణమే రూ.10 వేలు ఇవ్వాలన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఎలాంటి అలక్ష్యానికి తావులేకుండా.. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలన్న సీఎం, అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. తుపాను అనంతరం తాను పర్యటిస్తానని, ఎక్కడా సమస్య వినిపించకూడదన్నారు. సంతృప్తికర స్ధాయిలో బాధితులందరికీ సహాయం అందాలన్నారు.

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.