కానిస్టేబుల్​పై ఇద్దరు మహిళల దాడి.. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

author img

By

Published : Mar 10, 2023, 11:58 AM IST

Assault on lady constable

Assault on lady constable: మహిళా కానిస్టేబుల్​పై ఇద్దరు మహిళలు దాడి చేశారు. ఓ వివాహ వేడుక వద్ద గొడవ జరుగుతుందనే సమాచారంతో మహిళా కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పెళ్లి బృందం వారు ఇచ్చిన ఫిర్యాదుపై ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో సునీతపై మహిళలు దాడికి పాల్పడ్డారు. మరో చోట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ - ద్విచక్ర వాహనం ఢీకొనగా.. రెండు వాహనాలు చెరువులోనికి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కానిస్టేబుల్​పై ఇద్దరు మహిళలు దాడి

Assault on lady constable: మహిళా కానిస్టేబుల్​పై దాడి జరిగిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో చోటుచేసుకుంది.. వేటపాలెం పట్టణంలోని కుందేరు సమీపంలో ముస్లింల ఇంటి వద్ద వివాహం జరుగుతోంది.. ఈ వివాహం దగ్గర గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో వేటపాలెం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ సునీత, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఆ గొడవను అదుపు చేస్తూ గొడవకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో స్థానికులు మహిళా కానిస్టేబుల్ సునీతపై దాడి చేశారు. బాధిత మహిళా కానిస్టేబుల్ సునీత పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.. విషయం తెలుసుకున్న గ్రామీణ సీఐ మల్లికార్జున రావు హుటాహుటిన స్టేషన్​కు చేరుకుని బాధితురాలిని పరామర్శించి చికిత్స నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు.. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇస్లాంపేట దగ్గర గొడవ జరుగుతోంది అని మాకు ఫోన్​ చేశారు.. దీంతో నేను మా కానిస్టేబుల్స్​ ఇద్దరు కలసి అక్కడకి వెళ్లాము. అక్కడకు వెళ్లి చూస్తే గొడవ జరుగుతోంది. అక్కడ ఉన్న వారు అందరూ ఒక అబ్బాయి వల్లే గొడవ జరుగుతోంది అని చెప్తే ఆ అబ్బాయిని పక్కకు తీసుకు వచ్చి బండి ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా పక్కన ఉన్న అతని ఇద్దరు అక్కలు వచ్చి వీడియో తీస్తున్నారు. అప్పుడు నేను వారి దగ్గర ఉన్న ఫోన్​ తీసుకున్నా.. అప్పుడు వాళ్లు నా మీద దాడి చేశారు. కనీసం నేను యూనిఫామ్​లో ఉన్నా సరే వారు నా మీద విచక్షణారహితంగా దాడి చేశారు.- సునీత, మహిళా కానిస్టేబుల్, వేటపాలెం

ఘోర రోడ్డు ప్రమాదం: ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ - ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు వాహనాలు చెరువులోనికి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్​పై ఉన్న ముగ్గురు స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడు మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామానికి చెందిన మద్దిరెడ్డి రామకృష్ణా రెడ్డిగా పోలీసులు గుర్తించారు. చెరువు కట్ట ఉన్న రహదారి అస్తవ్యస్తంగా రోడ్డు అంతా కూడా గోతులమయంగా ఉండడం వలన తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా ఇంకా ఎంత మంది ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవాలి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.