సైకిల్ హవా మొదలైంది.. జగన్ పని అయిపోయింది: నారా లోకేశ్

author img

By

Published : Mar 17, 2023, 9:03 PM IST

Nara Lokesh

Nara Lokesh Yuvagalam padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 45 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రను ప్రారంభించిన రోజు నుంచి నేటిదాకా ఆయన దాదాపు 580 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన లోకేశ్.. సీఎం జగన్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది.. జగన్ పని అయిపోయింది అంటూ ధ్వజమెత్తారు.

సైకిల్ హవా మొదలైంది.. జగన్ పని అయిపోయింది: నారా లోకేశ్

TDP National General Secretary Nara Lokesh Yuvagalam padayatra updates: ''సీఎం జగన్.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నువ్వు (జగన్) శాశ్వతంగా తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యే రోజు త్వరలోనే రానుంది. డబ్బులతో ఏదైనా కొనొచ్చు అనుకునే ఈ వైసీపీ నాయకులకు.. ఈ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు ఓ చెంపపెట్టు లాంటివి. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే.. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్థం. 2024 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలవడం ఖాయం.. సీఎం జగన్ ఇంటికే పరిమితమవ్వటం తథ్యం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది.. జగన్ పని అయిపోయింది'' అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్​పై ధ్వజమెత్తారు.

'యువగళం' 45వ రోజు పాదయాత్ర పూర్తి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 45 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 45 రోజుల పాటు సాగిన పాదయాత్రలో లోకేశ్ దాదాపు 580 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఆయన.. ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల కష్టాలను తెలుసుకుంటూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 44 రోజులపాటు పాదయాత్ర చేశారు. కుప్పంలోని 14 నియోజకవర్గాలలో సాగిన యువగళం పాదయాత్ర.. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో చిత్తూరు జిల్లా ముగింపు ప్రాంతంలో ఆ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకగా.. ఉమ్మడి అనంతపురం జిల్లా తనకళ్లు మండలం చీకటిమానుపల్లె వద్ద అనంతపురం జిల్లా పార్టీ నాయకులు, ప్రజలు లోకేశ్​కు భారీ స్వాగతం పలికారు.

సైకిల్ హవా మొదలైంది.. జగన్ పని అయిపోయింది: ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేశ్.. సీఎం జగన్​పై విరుచుకుపడ్డారు. శాసనమండలి ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది.. జగన్ పని అయిపోయిందన్నారు. 2024 ఎన్నికల్లో విజయం టీడీపీదేనని లోకేశ్‍ తేల్చి చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నో విజయాలకు నిలయమెన తంబళ్లపల్లె ప్రాంతం నుంచి పాదయాత్ర ముగించడం తన అదృష్టమన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు పర్యటించి ప్రజలు పడుతున్న బాధలు నేరుగా తెలుసుకున్నానని ఆయన తెలిపారు.

ప్రజాగళాన్ని రాకుండా చేశారు- 'యువగళాన్ని' ఆపాలనుకున్నారు: అనంతరం యువతకు, మహిళలు, రెతుల సంక్షేమం కోసం ఏమి చేయని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలతో భేటీలో వైసీపీ పాలనలో వాళ్ళు ఎదుర్కొన్న వేధింపులు గురించి తెలుసుకున్న తరువాత.. మనం జగన్ పాలనలో ఉన్నామా? లేక తాలిబాన్ల పాలనలో ఉన్నామా? అనే సందేహం వచ్చిందన్నారు. ప్రజాగళం బయటకు రాకూడదు అనే 'యువగళాన్ని' పోలీసుల ద్వారా ఆపాలని ప్రయత్నించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన ద్వారా తనకు తెలిసిందన్నారు. ఎంత మంది పోలీసుల్ని పంపినా నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలన్ని 'యువగళం' పాదయాత్ర ద్వారా బయటకు వచ్చాయని నారా లోకేశ్ వివరించారు.

తంబళ్లపల్లెలో మూడు టీలు ఉన్నాయి?: ఎన్నికల ముందు బిల్డప్ బాబాయ్ ఇచ్చిన ఏ ఒక్క హమీని.. ముఖ్యమంత్రి అయ్యాక నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు. టీడీపీ హయంలో హంద్రీనీవా, గాలేరు నగరి, రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది రూ. 11 వేల కోట్లని.. హింసించే పులకేశి 4 ఏళ్లలో ఖర్చు చేసింది రూ. 2,700 కోట్లు మాత్రమేనని తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మూడు టీలు బాగా ప్రచారంలో ఉన్నాయని.. తంబళ్లపల్లె, తాగుబోతు ఎమ్మెల్యే, తాలిబాన్ పరిపాలన అని దుయ్యబట్టారు. ఒక్క తంబళ్లపల్లె మండలంలోనే ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, ఆయన అనుచరులు 200 ఎకరాల భూమిని మింగేశారని.. ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లాక్కున్న భూములు తిరిగి యజమానులకు ఇచ్చేలా టీడీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

టీడీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే.. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. 2024 ఎన్నికల్లో మార్పు కలిగేలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలకు శ్రీకారం చుట్టాలని తాము ప్రజలను అడిగామన్నారు. దానికి వాళ్లు తమ నిర్ణయాన్ని ఓటు రూపంలో ఇలా సమాధానాన్ని ఇచ్చి..ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారని లోకేశ్ తెలిపారు. అధికార పార్టీ మొదట అభ్యర్థులను, తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టారని మండిపడ్డారు. చివరికి దొంగ ఓట్లు సృష్టించి.. 6, 7వ తరగతి చదివిన వాళ్లతో పట్టభద్రుల ఓట్లను వేయించారని ఆరోపించారు. కానీ, చివరికీ డబ్బు బలం, అధికార బలం, అవినీతి బలం.. ఏవీ కూడా ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయాయని.. జగన్ మీదున్న అసంతృప్తిని చల్లార్చలేకపోయాయని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.