ఫ్యాన్లు విరిచేశారని.. పోలీస్​ స్టేషన్​కు ముగ్గురు విద్యార్థులు.. ఎక్కడంటే?

author img

By

Published : Mar 17, 2023, 7:29 PM IST

Jangareddygudem

Jangareddygudem police beat up three students: పాఠశాలలోని ఫ్యాన్లను విరిచేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారంటూ.. ముగ్గురు విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయులు.. వారిని పోలీస్‌ స్టేషన్‌కి అప్పగించిన ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. విద్యార్థులను మందలించిన పోలీసులు.. వారిని ఇంటికి పంపకుండా స్టేషన్‌లోనే ఉంచి.. నీళ్లు, ఆహారం ఇవ్వకుండా రాత్రివరకు సెల్‌లో ఉంచడంపై విద్యార్థుల తల్లిండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తమ పిల్లలను స్టేషన్‌కి తరలించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Jangareddygudem police beat up three students: పిల్లలు ఇంట్లో అల్లరి పని చేస్తే.. వారిని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అదే.. పాఠశాలలో తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఆ పాఠశాల యాజమాన్యానిది. కానీ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉన్న ఓ పాఠశాల యాజమాన్యం మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంది. ముగ్గురు విద్యార్థులు తరగతి గదిలోని ఫ్యాన్లను విరిచేసి, ఫర్నిచర్‌‌ను ధ్వంసం చేశారంటూ పోలీసులకు అప్పగించారు. తమ పిల్లల్ని ఎందుకు పోలీసులకు అప్పగించారంటూ ప్రశ్నించిన తల్లిదండ్రులను బెదిరించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. ఇటీవలే తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లను విరిచేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారంటూ ఉపాధ్యాయులు.. ఆ విద్యార్థులను చితకబాదడమే కాకుండా వారిని కారులో ఎక్కించి.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో జంగారెడ్డిగూడెం పోలీసులు వారిని మందలించి.. ఇంటికి పంపించకుండా.. కనీసం నీళ్లు, ఆహారం ఇవ్వకుండా.. రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిండ్రులు.. ఉపాధ్యాయులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను రాత్రి వరకు స్టేషన్‌లో ఉంచడమే కాకుండా విచారణ పేరుతో మరోసారి స్టేషన్‌కి రావాలని అధికారులు చెప్పడంపై తల్లిదండ్రులు ఆవేదన చెందారు.

ఫ్యాన్లు విరిచేశారని.. పోలీస్​ స్టేషన్​కు ముగ్గురు విద్యార్థులు

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ''మా పిల్లలు స్కూల్లో ఫ్యాన్లను విరిచేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని బాగా కొట్టారు. ఆ తర్వాత కారులో ఎక్కించి.. నేరుగా జంగారెడ్డిగూడెంలోని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. స్కూల్‌కు వెళ్లి మేము అడిగితే.. మీ పిల్లలు తప్పు చేయడానికి కారణం మీరే అంటూ మీపై కూడా కేసు పెడతామని బెదిరించారు. మీ పిల్లలు పదే పదే ఇలా అల్లరి పనులు చేస్తుండడంతో.. వారి తీరులో మార్పు రావాలని.. కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కి పంపించామని ఉపాధ్యాయులు సమర్థించుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. మా పిల్లలు ఏ తప్పు చేయలేదు'' అని తల్లిదండ్రులు తెలిపారు.

అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. స్కూల్‌కి వెళ్లేసరికే తమ క్లాసు రూమ్‌లోని ఫ్యాన్లు, ఫర్నిచర్ అప్పటికే విరగకొట్టి ఉన్నాయన్నారు. వాటిని సరిచేయాలని తాము చూస్తుండగానే సార్ వాళ్లు వచ్చి.. 'మీరే వాటిని ధ్వంసం చేశారంటూ మమ్మల్ని కొట్టారు'. ఆ తర్వాత కారులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి పంపించారన్నారు. స్టేషన్‌కి వచ్చాక తమను కానిస్టేబుల్ కొట్టారని విద్యార్థులు వాపోయారు. తాము ఏ తప్పు చేయలేదని చెప్తున్న కూడా పోలీసులు ఉదయం నుంచి సెల్‌లో పడేసి.. ఇంటికి పంపించకుండా, నీళ్లు, ఆహారం ఇవ్వకుండా రాత్రి వరకు ఉంచారన్నారు. తమ తల్లిదండ్రులు స్టేషన్‌కు వచ్చి అధికారులతో మాట్లాడిన అనంతరం ఇంటికి పంపించారని వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.