ETV Bharat / state

Accidents: రోడ్డు ప్రమాదంలో ఒకరు.. అగ్ని ప్రమాదంలో మరొకరు మృతి

author img

By

Published : Apr 17, 2023, 7:58 PM IST

AP crime news: అనంతపురం జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో నిరంజన్ అనే మానసిక వికలాంగుడు అగ్నికి ఆహుతయ్యాడు. అనంతపురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటనలో పోలీసు కేసు నమోదైంది.

AP crime news
రోడ్డు ప్రమాదం

Crime news: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో మస్కిటో కాయిల్​ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు పోగా.. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇక ఇదే జిల్లాలో ఇద్దరు మైనర్​ బాలికలు అదృశ్యమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పిల్లల ఆచూకీ కనుగొన్నారు. త్వరలోనే తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామని తెలిపారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మార్లపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంలో నిరంజన్ అనే వ్యక్తి మృతి చెందాడు. నిరంజన్ గ్రామ సరిహద్దులో గల ఇంటిలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. అతనికి మతి స్థిమితం సరిగ్గా లేదని వెల్లడించారు. దోమల నివారణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నిరంజన్ ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. పోలీస్, అగ్ని మాపక శాఖ అధికారులు ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని వెల్లడించారు.

ద్విచక్ర వాహనాన్ని స్కార్పియో వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి స్కార్పియో ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎగువపల్లికి చెందిన వెంకటప్ప (55), నాగరాజు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటప్పను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. నాగరాజుకు చికిత్స అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలికల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిన్నటి నుంచి 17 ఏళ్ల బాలిక కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో పదవ తరగతి పరీక్ష రాసిన బాలిక ఇంటికి తిరిగి రాలేదని ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికల అదృశ్యంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ లభించిందని, వారిని త్వరలోనే తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.