ETV Bharat / state

చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగు

author img

By

Published : May 21, 2020, 8:58 PM IST

అసలే అంతంతమాత్రంగా సాగుతున్న చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగులా మారింది. ఒక్కపూట కూడా తినలేని దుర్భర స్థితిలోకి నెట్టేసింది. నేసిన వస్త్రాలు అమ్ముడుపోలేదని వ్యాపారులు డబ్బు చెల్లించడం లేదు. చేతిలో చిల్లిగవ్వలేక.. ముడిసరుకు కొనలేక.. 2నెలలుగా పనిలేక నేతన్న అల్లాడిపోతున్నాడు. వసతి గృహాలు మూతపడి ఇల్లు చేరిన పేగు బంధాల ఆకలి తీర్చలేక... తనలో తానే కుమిలిపోతున్నాడు. రేషన్ బియ్యంతో, దాతలెవరైనా వచ్చి ఇచ్చే కొద్దిపాటి కూరగాయలతో ఒక్కపూట తింటూ బతుకీడుస్తున్న అనంతపురం జిల్లా చేనేత కార్మికులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగు
చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగు

చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగు

దేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా జీవనోపాధి కల్పిస్తున్న రంగం చేనేత. కానీ లాక్​డౌన్ చేనేత కార్మికుల బతుకులను దుర్భరంగా మార్చేసింది. చేద్దామంటే పనిలేదు. చేసిన పనికి కూలీ రాదు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 76వేలు చేనేత మగ్గాలున్నాయి. లక్షన్నర మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అనంతపురం జిల్లాలో చేనేత కాకుండా మరమగ్గాలు 15వేల వరకు ఉన్నాయి. లాక్​డౌన్ వేళ చేనేత కుటుంబాల జీవన స్థితిగతులపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక దయనీయమైన పరిస్థితులు కనిపించాయి.

అనంతపురం జిల్లాలో ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, తాడిపత్రి, యాడికి, సోమందేపల్లి ప్రాంతాల్లో చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాకుండా రాయదుర్గం, ఉరవకొండ, పుట్టపర్తిలో చేనేత టెక్స్​టైల్ పార్కులు విస్తరించి ఉన్నాయి. ఏటా మూడు లక్షల వరకు పట్టుచీరలు తయారుచేసే నేత కార్మికుల ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. చేనేతలు తాము నేసిన వస్త్రాలు వ్యాపారులకు ఇచ్చినప్పటికీ, అవి అమ్ముడపోలేదని ఒక్క రూపాయి కూడా చేతికివ్వని పరిస్థితి ఉంది. నేతన్నల కష్టంతో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు నిరుపేద నేత కళాకారులపై కనీస దయ కూడా చూపటం లేదు.

ఈసారి పెళ్లిళ్ల సీజన్ లాక్​డౌన్ కారణంగా వెలవెలపోయింది. ధర్మవరం నుంచి ఎగుమతి చేసిన పట్టుచీరలు రెండు నెలల నుంచి ట్రాన్స్ పోర్టు కార్యాలయాల గోదాముల్లోనే ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్, కంచి, చెన్నై తదితర మహా నగరాలకు ధర్మవరం నుంచి పంపిన చీరలకు అక్కడి రిటైల్ వ్యాపారులు కోట్ల రూపాయలు చెల్లింపులు చేయటం లేదు. ఎవరి కష్టాలు వారివన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, అంతిమంగా పూటగడవక ఆకలితో అలమటించిపోతున్నది మాత్రం నిరుపేద చేనేత కార్మికులే. తమకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, పంపిన పట్టు వస్త్రాలకు డబ్బులు రావటంలేదని వ్యాపారులు చెబుతున్నారు..

ఇక ప్రభుత్వం అందిస్తున్న నేతన్న హస్తం ఆర్థిక సహాయం 24వేల రూపాయల విషయంలో అయిన వారికి కంచంలో... కానివారికి విస్తర్లో అన్నట్లుగా పథకం అమలు ఉంది. మగ్గాలు లేకపోయినా నేత కార్మికులుగా పేర్లు నమోదు చేసి ఏటా 24 వేల రూపాయలు ఇస్తున్నారని నిరుపేద నేతన్నల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి

కోవిడ్‌-19 ప్రభావంతో తీవ్ర నష్టాల్లో చేనేత రంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.