ETV Bharat / state

హైదరాబాద్‌లోని ఆ కాలనీల్లో వంటపని, ఇంటిపనులకూ మినరల్‌ వాటరే..

author img

By

Published : Oct 25, 2022, 2:10 PM IST

మినరల్‌ వాటర్‌
mineral-water

Contaminated water in Jeedimetla: వంటపని, ఇంటిపనులకూ మినరల్‌ వాటరే వాడుతున్నారంటే.. వాళ్లెంత రిచ్చో, అని అనుకుంటే.. పప్పులో అడుగెసినట్లే. హైదరాబాద్ లోని ఓ 18 కాలనీ వాసులు ఎదుర్కొంటున్న దీనగాధ ఇది. ఆ కాలనీల్లో ఎక్కడ బోరు వేసినా రసాయనాలు, రంగునీళ్లు భూగర్భంలోంచి వస్తున్నాయి. ఈ కాలకూట విషాన్ని వినియోగిస్తే చర్మవ్యాధులు దాపురిస్తుండటంతో, చేసేది లేక అన్ని పనులకు మినరల్ వాటర్నే వాడాల్సి వస్తోందని.. ప్రజలు వాపోతున్నారు.

Contaminated water in Jeedimetla: మీరు ఎప్పుడైనా బోరింగ్‌ నుంచి రసాయనాలు, రంగునీళ్లు రావడం చూశారా..? హైదరాబాద్ జీడిమెట్లకు రండి.. అక్కడ 18 కాలనీల్లో ఎక్కడ బోరు వేసినా రసాయనాలు కలిసిన ఎర్రటి నీళ్లు భూగర్భంలోంచి వస్తాయి. భూమిలోంచి వస్తున్న ఈ కాలకూట విషాన్ని వినియోగిస్తే చర్మవ్యాధులు ప్రభలుతున్నాయని భయపడి అక్కడి జనం జలమండలి తాగునీటిని భద్రంగా దాచుకుంటున్నారు. వంట పని, ఇంటి పనులకు మినరల్‌ వాటర్‌ వినియోగిస్తున్నారు. భవన నిర్మాణాలకు ట్యాంకర్ల నీటిని తెప్పించుకుంటున్నారు. కాలుష్యం గురించి తెలిసినా కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు.

బోర్ల ఖర్చు వృథా: వీరభద్రనగర్‌లో ఉండే సురేష్‌రాయ్‌ ఇల్లు కట్టుకునేందుకు ఇటీవల బోరు వేశారు. రంగునీళ్లు వస్తున్నా పునాదుల వరకే కదా అని రసాయనాలు కలిసిన నీళ్లనే వినియోగించారు. నాలుగైదు రోజుల నుంచి ఎర్రటినీళ్లతో పాటు దుర్వాసన రావడంతో వాడకం నిలిపేశారు. వెంకటేశ్వరనగర్‌లో ఒక్కో బోరుకు రూ.1.50 లక్షలు ఖర్చయిందని, నిరుపయోగంగా మారాయని ప్రజలు వాపోతున్నారు.

తాగునీటి ఖర్చు తడిసి మోపెడు: గ్రేటర్‌లో ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నా జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల వాసులకు తాగునీటి ఖర్చే తడిసిమోపెడవుతోంది. కొందరికి నీటి ధార సన్నగా వస్తుండడమే దీనికి కారణం. ఆరుగురు సభ్యులున్న కుటుంబం తాగునీటి కోసం నెలకు సగటున రూ.3-4 వేలు ఖర్చు చేస్తోంది.

శ్వాసకోశ ఇబ్బందులు.. చర్మవ్యాధులు: కలుషిత జలాలను స్వల్ప మొత్తంలో వినియోగిస్తున్నవారు, రసాయనాల ఘాటు పీలుస్తున్న ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు చర్మవ్యాధులు పెరుగుతున్నాయి. వీరిని పరిశీలిస్తున్న వైద్యులు కనీసం 4 గంటల పాటైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటూ సూచిస్తున్నారు. రుతువులు మారినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు జరిగే రసాయన చర్యల వల్ల పారిశ్రామికవాడ పరిసరాల్లో 60 శాతం మందికిపైగా చర్మవ్యాధుల బారిన పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.