ETV Bharat / state

ఔషధ మొక్కల విలువ తెలిసేలా.. అల్లూరిలో మెడిసినల్ పర్యాటక కేంద్రం

author img

By

Published : Feb 9, 2023, 5:49 PM IST

Medicinal Tourism Centre Opening in Araku Valley: 'ఆంధ్రా ఊటీ'గా పేరుగాంచిన అరకు లోయలో రానున్న రోజుల్లో మెడిసినల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. పర్యాటకులకు ఔషధ మొక్కల విలువలను తెలిపేందుకు ఐటీడీఏ అధికారులు ఔషధ మొక్కల పెంపక కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాదు, ఔషధ మొక్కల పెంపకాన్ని తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కోసం విడిది గదులను కూడా తీసుకువచ్చారు.

medicinal plantation
medicinal plantation

అల్లూరిలో ఔషధ మొక్కల పెంపక కేంద్రం ప్రారంభం

Medicinal Tourism Centre Opening in Araku: అడవుల్లో అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు ఐటీడీఏ అధికారులు జీవం పోస్తున్నారు. భవిష్యత్‌ తరాలకు వీటి విలువను తెలిపేందుకు పాడేరు ఐటీడీఏ అధికారులు లక్షల రూపాయలను వెచ్చించి ఔషధ మొక్కల పెంపక కేంద్రాన్ని ప్రారంభించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్తవలసలో సుమారు 150 ఔషధ మొక్కలను పెంచుతున్నారు. 20 లక్షల రూపాయలు వెచ్చించి పాడేరు ఐటీడీఏ అధికారులు కొత్తవలసలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ మొక్కల పెంపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఆంధ్ర ఊటీ అరకు లోయకు వచ్చే పర్యాటకులకు మెడిసినల్ పర్యాటకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృత చర్యలు చేపట్టారు.

ఇప్పటికీ ఇక్కడ ఇంచుమించు 110 ఔషధ మొక్కలను పెంచుతున్నాము. ఈ మొక్కలు ఆయుర్వేదం పరంగా బాగా ఉపయోగపడతాయి. దీన్ని అభివృద్ది చేయడానికి ఐటీడీఏ అధికారులు చాలా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అరకులోయతో పాటు మెడిసినల్ కేంద్రం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. పర్యాటకుల కోసం విడిది గదులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము.-బొంజు బాబు హార్టికల్చర్ అధికారి కొత్తవలస

తులసి, అలోవెరా, పసుపు, కర్పూరం, నిమ్మగడ్డి వంటి అనేక ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఈ ఔషధ మొక్కలతో మలేరియా, అతిసార, వాంతులు, కిడ్నీలో రాళ్లు, ఆస్తమాతోపాటు పలు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఔషధ మొక్కల పెంపకాన్ని తిలకించేందుకు వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా 40 లక్షల రూపాయల వ్యయంతో ఐటీడీఏ అధికారులు విడిది గదులను సైతం అందుబాటులోకి తెచ్చారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.