ETV Bharat / state

హైదరాబాద్‌ ఈ రేసింగ్‌లో.. సందడి చేసిన సెలబ్రిటీలు.. మీరు ఓ లుక్కేయండి!

author img

By

Published : Feb 11, 2023, 6:16 PM IST

Updated : Feb 12, 2023, 6:37 AM IST

e-racing
e-racing

Formula-e racing begins in Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ రేసింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రేసింగ్‌ను చూసేందుకు సినీ హీరోలు, రాజకీయ నాయకులు, భారత క్రికెట్ ఆటగాళ్లు, వ్యాపారవేత్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తొలిసారి హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫార్మూలా-ఈ రేసింగ్‌ జరగడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Formula-e racing begins in Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో ఈరోజు ఫార్ములా- ఈ రేసింగ్‌ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ తీరంలో జరుగుతోన్న ఫార్ములా-ఈ రేసింగ్ లీగ్‌లో పలువురు ప్రముఖలు సందడి చేశారు. సినీ నటుడు నాగార్జున, రామ్‌ చరణ్, నాగ చైతన్య, అఖిల్‌, నవదీప్‌, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ అశ్విన్‌, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, మాజీ క్రికెటర్ సచిన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేసింగ్‌ను వీక్షించారు. గ్యాలరీ నుంచి తమ ఫేవరెట్ జట్టు అయిన భారత్‌కు చెందిన మహీంద్రాకు సపోర్ట్ చేశారు.

అనంతరం భారత్‌కు రావటం చాలా సంతోషంగా ఉందని.. భారత్‌లో మోటార్ స్పోర్ట్ నిర్వహించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ మహమ్మద్ సులేమాన్ పేర్కొన్నారు. భారత్‌లో ఈ స్పోర్ట్ హై లెవెల్లో ఉందని.. భవిష్యత్తులో రేసింగ్ నిర్వహించడానికి మరికొన్ని ట్రాక్‌లనూ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఇప్పుడు నిర్వహించినట్టే ఎఫ్ఐఏ.. ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్ నుంచి కూడా రేసర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని.. మరికొంతమంది కార్ల తయారీదారులు కూడా రేసింగ్ లీగ్‌లో పాల్గొనాలని కోరారు.

మరిన్ని జరగాలి..: భారత దేశంలో ఇలాంటి రేసులు రావడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంతర్జాతీయ రేసింగ్‌లు భారత్‌లోనూ.. అందులోను హైదరాబాద్‌లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఏపీకి చెందిన ఎంపీలు సి.ఎం.రమేశ్‌, రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌ ఫార్ములా రేస్‌ను వీక్షించేందుకు విచ్చేశారు.

ఈ సందర్భంగా ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నెక్లెస్‌ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందన్నారు. ఫార్ములా ఈ రేసుకు రెండో రోజు హాజరైన కేటీఆర్‌.. అసెంబ్లీ సమావేశాల కారణంగా తొలి రోజు రాలేకపోయానన్నారు.

హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు..: హైదరాబాద్‌లోని యువత, మోటార్‌ స్పోర్ట్స్ ఔత్సాహికులు రేసును వీక్షించేందుకు తరలివస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు. రేస్‌ కారణంగా నగరవాసులకు కొంత అసౌకర్యం కలుగుతున్న విషయం వాస్తవమే.. కానీ, ఓపికతో మన్నించి సహకరిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత ఈ-వెహికల్ అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మూడు డబుల్ డెక్కర్ బస్సుల సంఖ్యను రానున్న రోజుల్లో 30కి తీసుకెళ్లేలా చూస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగింది: దేశంలోనే మొదటిసారి ఫార్ములా ఈ రేసు హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందని అర్వింద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగిందని వివరించారు. ఈ రేసింగ్ చూసేందుకు 30 వేల టిక్కెట్ల విక్రయాలు జరిగాయని తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో పది చోట్ల పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశామని అన్నారు.

ఫార్ములా- ఈ రేసింగ్‌కు తరలివచ్చిన ప్రముఖులు

ఇవీ చదవండి

Last Updated :Feb 12, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.