ETV Bharat / science-and-technology

గురు గ్రహ చందమామపై నీటి ఆవిరి

author img

By

Published : Jul 28, 2021, 8:38 AM IST

హబుల్‌ టెలిస్కోపు అందించిన తాజా, పాత డేటాల ఆధారంగా గానీమీడ్​ వాతావరణంలో నీటి ఆవిరిని నాసా గుర్తించింది. తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని పేర్కొంది. రోజు మొత్తంలో ఈ చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉంటున్నట్లు తెలిపింది.

jupiter moon, గురు గ్రహం చందమామ గానీమీడ్​
గురు గ్రహ చందమామపై నీటి ఆవిరి

గురుగ్రహం చందమామ 'గానీమీడ్‌' వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్‌ టెలిస్కోపు అందించిన తాజా, పాత డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. ఆ ఉపగ్రహ ఉపరితలం మీదున్న ఐసు.. ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. సౌర కుటుంబంలోని చందమామలన్నింటిలోకి గానీమీడ్‌ అతి పెద్దది. భూమి మీదున్న మహా సాగరాల్లో ఉన్న మొత్తం నీటి కన్నా ఈ చందమామలోనే ఎక్కువ నీరు ఉండొచ్చని మునుపటి పరిశోధనలు కొన్ని ఆధారాలను అందించాయి.

అయితే తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని నాసా పేర్కొంది. గానీమీడ్‌ ఉపరితలానికి సుమారు 160 కిలోమీటర్ల కింద మహాసముద్రం ఉంది. అందువల్ల అక్కడి వాతావరణంలోని నీటి ఆవిరి.. ఆ సాగరం నుంచి వచ్చింది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. హబుల్‌ టెలిస్కోపులోని ఇమేజింగ్‌ స్పెకోగ్రాఫ్‌, కాస్మిక్‌ అరిజిన్స్‌ స్పెక్షోగ్రాఫ్‌ సాధనాలు తీసిన పాత, కొత్త చిత్రాలను పరిశీలించినప్పుడు.. విద్యుదావేశంతో కూడిన వాయు పట్టీలు కనిపించాయి. దీన్ని బట్టి ఈ చందమామకు బలహీన అయస్కాంత క్షేత్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అలాగే.. రోజు మొత్తంలో ఈ చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉంటున్నట్లు గమనించారు. మధ్యాహ్న సమయంలో అక్కడి మధ్యరేఖా ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఉపరితలం మీదున్న మంచు స్వల్బ పరిమాణంలో నీటి అణువులను ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. గానీమీడ్‌ వాతావరణంలో అటామిక్‌ ఆక్సిజన్‌ పెద్దగా లేదని, మాలిక్యులర్‌ ఆక్సిజన్‌ (ఓ2) మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మంచు ఉపరితలంపై ఆవేశిత రేణువులు క్షీణించినప్పుడు ఇది ఉత్తవుతోందని చెప్పారు.

ఇదీ చదవండి : నాసాకు రూ.15 వేల కోట్ల డిస్కౌంట్‌ ఇస్తానంటున్న బెజోస్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.