ETV Bharat / opinion

గృహ సారథి X కుటుంబ సారథి.. ఇక ఇంటింటా రాజకీయం!

author img

By

Published : Feb 18, 2023, 7:54 PM IST

Updated : Feb 18, 2023, 8:29 PM IST

కూల్చివేతలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, దాడులు, ప్రజా ఉద్యమాలు, కోర్టు తీర్పులతో దాదాపు నాలుగేళ్లుగా 70ఎంఎం స్క్రీన్​పై హైఓల్టేజ్ యాక్షన్​ డ్రామాను తలపిస్తోంది ఏపీ పొలిటికల్ డ్రామా. ఇప్పుడు కథ క్లైమాక్స్​కు చేరింది. తాడోపేడో తేల్చే శాసనసభ ఎన్నికలకు ఇక మిగిలి ఉంది ఒకే ఒక్క ఏడాది. ఆంధ్రా రాజకీయం ఇప్పుడు మరో మలుపు తిరగనుంది. ఎమోషనల్ టచ్​తో ఓటీటీ వెబ్​సిరీస్​ తరహాలో ఇంటింటికీ చేరనుంది. వైసీపీ 'గృహ సారథి', టీడీపీ 'కుటుంబ సారథి' ఈ నయా రాజకీయ క్రీడలో కీలక ఆటగాళ్లు. వీరిలో ఎవరి టీమ్​ గోల్ కొడుతుందనేది ఆసక్తికరం.

GRUHA SARATHI KUTUMBA SARATHI
GRUHA SARATHI KUTUMBA SARATHI

"క్షేత్రస్థాయిలో 5.65 లక్షల మందితో వైకాపా సైన్యం అందుబాటులోకి వస్తుంది. వీరితోనే పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. ఇప్పటికే 387 మండలాల్లో గృహ సారథులకు శిక్షణ ఇచ్చారు, మిగిలిన మండలాల్లోనూ ఈ నెల 19లోగా శిక్షణను ఎమ్మెల్యేలు పూర్తి చేయాలి."
--జగన్​ మోహన్​ రెడ్డి, వైసీపీ అధినేత

"పేదలే దేవుళ్లు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్​టీఆర్. ఆయన ఆశయాలను సాకారం చేద్దాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసినవారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయా. ఈసారి పక్కా వ్యవస్థలతో వారికి ప్రాధాన్యం ఇస్తాం. పార్టీలో సెక్షన్‌ ఇన్‌ఛార్జులుగా పనిచేసిన వారిని ఇకపై కుటుంబ సాధికార సారథులుగా నియమిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఈ విభాగం ఉంటుంది."
--నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

వైసీపీ 'గృహ సారథులు' వర్సెస్​ టీడీపీ 'కుటుంబ సారథులు'.. ఎన్నికల ఏడాదిలో ఆంధ్రప్రదేశ్​లో సాగనున్న నయా రాజకీయానికి సంక్షిప్త రూపమిది. మునుపెన్నడూ లేని స్థాయిలో.. ప్రతి ఓటరుపైనా వ్యక్తిగతంగా గురిపెట్టాయి రెండు ప్రధాన పార్టీలు. బడా నేతల వాగ్బాణాలు, మేనిఫెస్టోల్లోని వాగ్దానాలతో సరిపెట్టకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేందుకు 'పర్సనల్ టచ్​' యాడ్ చేశాయి. పార్టీ సారథులు ఇంటింటికీ వెళ్లి.. కనీసం 5-10నిమిషాలు కుటుంబసభ్యులతో మంచిచెడులు మాట్లాడి.. ప్రతి ఒక్కరితో 'ఎమోషనల్​ బాండ్​' ఏర్పరుచుకునేందుకు సిద్ధమయ్యాయి.

స్టిక్కర్​ అస్త్రంతో జగన్ సైన్యం
అధికార వైసీపీ ఇలా 'పర్సనల్​ టచ్​'తో రాజకీయం చేసే ప్రయత్నం ఇది మొదటిది కాదు. 2019లో అధికార పగ్గాలు చేపట్టాక వాలంటీర్ల వ్యవస్థను సృష్టించింది జగన్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి 50 ఇళ్ల బాధ్యతలు అప్పగించింది. నెలకు రూ.5వేలు గౌరవ వేతనంతోపాటు సెల్​ఫోన్ బిల్లులు, పురస్కారాలు, సత్కారాలు, సాక్షి పత్రిక కొనుగోలుకు కలిపి ఏడాదికి రూ.1909కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారన్న విమర్శలు, జగన్​ మార్క్ పాలన గొప్పతనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారన్న వైసీపీ నేతల ఆందోళనలు, ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాల్సి రావచ్చన్న అనుమానాల మధ్య మరో కొత్త 'సైన్యం' సృష్టించింది ఆ పార్టీ. 'వై నాట్ 175' అంటూ భారీ స్కెచ్ వేసింది.

GRUHA SARATHI KUTUMBA SARATHI
వైఎస్ జగన్
  • గృహ సారథులు, సెక్రటేరియట్ కన్వీనర్ల పేరిట ఏకంగా 5.6లక్షల మంది నియామకం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు.
  • మార్చి 18-26 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం.
  • ఏపీలోని 1.65కోట్ల ఇళ్లకు వెళ్లి, ప్రతి కుటుంబాన్ని కలిసి.. వైసీపీ ప్రభుత్వ పథకాల గురించి వివరించడమే లక్ష్యం.
  • 'జగనన్నే మా భవిష్యత్తు' నినాదంతో ప్రజల సెల్​ఫోన్లకు స్టిక్కర్లు అతికించడం బోనస్.

జగన్​ నేతృత్వంలో ఫిబ్రవరి 13న జరిగిన సమావేశంలో గృహ సారథులు, కన్వీనర్లు చేయాల్సిన పనులపై విస్తృతంగా చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్తారు. కుటుంబసభ్యులతో మాట్లాడతారు. గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ పాలనలో ఏం జరుగుతుందో వివరిస్తారు. వైసీపీ పథకాల ద్వారా ఆ కుటుంబం ఏం లబ్ధి పొందిందో తెలిపే ప్రచార పత్రాలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటారు. 5 అంశాలపై ప్రశ్నలు వేసి ఓ పత్రం నింపుతారు. వారికి ఇబ్బంది లేకపోతే సంతకం చేయిస్తారు. జగన్ సర్కార్​పై విశ్వాసం ఉంటే మిస్డ్​కాల్ ఇవ్వాలంటూ ఓ నంబర్ ఇస్తారు.

నిజానికి ఎమ్మెల్యేల స్థాయిలోనే ఇలాంటి ప్రయత్నం చేసింది వైసీపీ. 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరిట ప్రజాప్రతినిధులే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసేలా కార్యక్రమం చేపట్టింది. అయితే.. అనేక చోట్ల ఎమ్మెల్యేలకు చేదు అనుభవమే ఎదురైంది. చెత్త పన్ను, అధ్వానమైన రోడ్లు వంటి సమస్యల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. వాలంటీర్లతో అనుకున్న లక్ష్యం నెరవేరని, గడప గడపకు కార్యక్రమం ఆశించినట్టు సాగని పరిస్థితుల్లో ఇప్పుడీ సారథుల్ని మోహరిస్తోంది.

కుటుంబ సారథులతో తెలుగుదేశం
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది తెలుగుదేశం. 'జీఓ నంబర్​ 1' పేరుతో జగన్ సర్కార్ ఎక్కడికక్కడ​ ఆంక్షలు విధిస్తున్నా, నేతలపై కేసులు పెడుతున్నా.. తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు ఇచ్చిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పుడీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతం చేసి, ప్రజలకు దగ్గరయ్యే లక్ష్యంతో 'కుటుంబ సాధికర సారథులు' పేరిట కొత్త వ్యవస్థను సృష్టిస్తోంది తెలుగుదేశం.

GRUHA SARATHI KUTUMBA SARATHI
చంద్రబాబు నాయుడు
  • రాష్ట్రంలోని ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథి నియామకం.
  • ఇప్పటివరకు పార్టీలో సెక్షన్ ఇన్​ఛార్జులుగా ఉన్నవారికి బాధ్యతలు.
  • ఆర్థిక అసమానతలు తొలగించడమే లక్ష్యం.
  • 'కుటుంబ సాధికార సారథి' వ్యవస్థలో పురుషులు, మహిళలకు సమాన భాగస్వామ్యం.

తెలుగుదేశం నియమించే కుటుంబ సారథులు.. తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్తారు. ప్రస్తుత వైసీపీ పాలనలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తెలుగుదేశం విధానపరమైన నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆ కుటుంబాలకు వివరిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తారు. కుటుంబ సారథులు ఇచ్చే ఫీడ్​బ్యాక్ ఆధారంగా రానున్న ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తోంది తెలుగుదేశం. పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ సారథుల్ని అలానే కొనసాగించనుంది. వారి పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సమన్వయం చేయడంలో సాధికార సారథుల్ని ఉపయోగించుకోనుంది.

అక్కడ పేజ్ ప్రముఖ్.. ఇక్కడ సారథి
ఎన్నికల ముందు ప్రధాన పార్టీలు ఇలా 30-50 ఇళ్లకు ఓ సారథిని నియమించడం ఆంధ్రప్రదేశ్​కు కొత్త. కానీ.. దాదాపు ఇలాంటి విధానం ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు సుపరిచితం. భాజపా ఇదే వ్యూహంతో అనేక చోట్ల విజయం సాధించింది. అయితే.. ఆ పార్టీ నేతలు ఈ వ్యవస్థను "పేజ్​ ప్రముఖ్​"గా పిలుస్తారు. అయితే.. సారథులకు, పేజ్​ ప్రముఖ్​లకు ఓ చిన్న తేడా ఉంది.

గృహ సారథులు, కుటుంబ సారథులకు 30 లేదా 50 ఇళ్ల బాధ్యత అప్పగిస్తున్నారు. కానీ భాజపా వ్యవస్థలో.. పోలింగ్‌ బూత్‌ ఓటర్​ లిస్ట్​లో ప్రతీ పేజ్‌కు పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని గుర్తిస్తారు. వారిని పేజ్ ప్రముఖ్​గా వ్యవహరిస్తారు. ఓటర్​ లిస్ట్​లో అదే పేజ్​లోని ఇతర ఓటర్లతో మాట్లాడి, పార్టీకి అనుకూలంగా మార్చి, ఓటు వేసేలా చేయడమే పేజ్ ప్రముఖ్ బాధ్యత. అలా ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 10-15 మంది పేజ్ ప్రముఖ్​లు ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వ్యూహంతో గెలిచిన కమలదళం.. 2021 ఏప్రిల్​లో జరిగిన తిరుపతి లోక్​సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పేజ్​ ప్రముఖ్ వ్యవస్థను సృష్టించేందుకు ప్రయత్నించినా.. సఫలం కాలేదు.

Last Updated : Feb 18, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.