ETV Bharat / state

ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Feb 18, 2023, 8:42 AM IST

Paddy Farmers Problems: రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజ కొంటామన్న ప్రభుత్వం ఉన్నట్టుండి చేతులెత్తేసింది. కొనుగోలు లక్ష్యం పూర్తయిందంటూ సేకరణను నిలిపివేసింది. ఫలితంగా ఉమ్మడి విజయనగరం జిల్లా కల్లాల్లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. మన్యం జిల్లా పరిస్థితి మరింత దయనీయం. అసలు ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ వీరఘట్టం మండలం చలివేంద్రికి చెందిన రైతులు కలెక్టర్‌ను అడ్డుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

Etv Bharat
Etv Bharat

ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

Paddy Farmers Problems: విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 2లక్షల 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 5 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 2 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇది పూర్తికాగానే క్షేత్రస్థాయిలో మరో లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉండిపోయినట్లు వ్యవసాయ అధికారులు తేల్చారు. వీటిలో 80 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతి తీసుకొని ఇప్పటి వరకు 65 వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈ లెక్కన మరో 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. మిగిలిన ధాన్యం ఎవరు తీసుకుంటారో చెప్పలేకపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో లక్షా 91 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 57 వేల మెట్రిక్ టన్నులు రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండో విడతగా 20 వేల మెట్రిక్ టన్నులకు అనుమతి ఇవ్వగా ఇదీ పూర్తి చేశామని చెబుతున్నారు. అయితే మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందని అంచనా.

ఒకేరోజు మూడుచోట్ల: మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం వీరఘట్టం మండలం చలివేంద్రిలో రైతులు ఏకంగా కలెక్టర్‌నే అడ్డుకున్నారు. ఇదే మండల పరిధిలోని సంతనరిశిపురంలోనూ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. గరుగుబిల్లి మండలం శివ్వాం, సీమలవానివలసలో ఆర్​బీకె సిబ్బందిని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇలా ఒకేరోజు మూడుచోట్ల అన్నదాతలు నిరసనలకు దిగారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

రంగప్రవేశం చేస్తున్న దళారులు: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఇంకా 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. తెర్లాం మండలంలోని 21 ఆర్​బీకెల పరిధిలో ఉన్న 33 పంచాయతీల్లో 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా వెయ్యి టన్నులే సేకరించాలని ఆదేశాలొచ్చాయి. మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఇప్పటివరకు 750 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. కర్రివలస, పాచిపెంట, పిండ్రింగివలస, పాంచాలి గ్రామాల్లో 400 టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. గరుగుబల్లి మండలం శివ్వాంలో 27వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. గ్రామాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకు క్వింటా 14 వందల నుంచి 15 వందలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు 12 వందలకే అడుగుతున్నారు.

లక్ష్యం..ఆందోళన: ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. మొదట్లో పెట్టుకున్న లక్ష్యం మేరకు అధికారులు సేకరణ పూర్తి చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. అప్పట్లోనూ అన్నదాతలు ఆందోళనలకు చేయక తప్పలేదు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.