Xi Jinping Permanent President : చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న జిన్‌పింగ్.. తన అధికారాన్ని శాశ్వతం చేసుకొనే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 16న జరిగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా-సీపీసీ సమావేశానికి.. జిన్‌పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సభ్యులు ఎన్నికయ్యారు.
20వ సీపీసీ సమావేశానికి హాజరయ్యేందుకు మెుత్తం 2,296 మంది సభ్యులను ఎన్నిక చేసినట్లు చైనా ప్రకటించింది. అయితే వీరి ఎన్నిక జిన్‌పింగ్ సూచనలకు అనుగుణంగా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్‌ను బంధించారు, పదవి నుంచి తొలగించారు అంటూ వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది. అదే విధంగా మూడోసారి చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలన్న.. తన లక్ష్యానికి జిన్‌పింగ్ మరింత దగ్గరైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అక్టోబర్ 16న జరిగే సీపీసీ సమావేశాలు ఈసారి ఎంతో ప్రత్యేకమైనవి. అధ్యక్షుడిగా, మిలటరీ అధినేతగా బాధ్యతలు చేపట్టి జిన్‌పింగ్ పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. దేశాధ్యక్ష పదవికి రెండుసార్లకు మించి పదవిలో ఉండకూడదని, 68 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందేనని చైనా శక్తిమంతమైన నేత మావో జెడాంగ్ తర్వాత అధికారంలోకి వచ్చిన డెండ్ జియవోపింగ్ నిర్దేశించారు. అయితే ఈ నిబంధనను మారుస్తూ గతేడాది నవంబర్‌లో జరిగిన సీపీసీ సమావేశంలో తీర్మానం తీసుకొచ్చారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తన వందేళ్ల చరిత్రలో చేసిన మూడో చారిత్రక తీర్మానంగా అది నిలిచింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే సీపీసీ సమావేశాల్లో మూడోసారి మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అధికారంలో కొనసాగేందుకు తెలిపే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చదవండి: మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు.. ఆ దేశాలకు హెచ్చరికగా క్షిపణి పరీక్ష!