Rishi Sunak: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి, భారత మూలాలున్న రిషి సునాక్ క్రమక్రమంగా పట్టు బిగిస్తున్నారు. బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లోనూ రిషి సునాక్ అత్యధిక మెజారిటీ (137 ఓట్లు) సాధించారు. తాజా రౌండ్ నుంచి వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రధాని పదవి కోసం పోటీలో ఇద్దరే నిలిచారు.
చివరి రౌండ్లో ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌తో రిషి తలపడనున్నారు. తుది అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో 1,60,000 మంది అర్హులైన కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. తుది పోరులో గెలిచిన వ్యక్తిని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. ఇలా కన్జర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించేవారే బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.
ఆరో దేశంగా బ్రిటన్?.. బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్.. టాప్-2లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఒకవేళ ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైతే.. భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో ఓసారి చూద్దాం..
- ఆంటోనియా కోస్టా - పోర్చుగల్ ప్రధానమంత్రి : గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవా కుంటుంబానికి చెందినవారు.
- మహమ్మద్ ఇర్ఫాన్ - గయానా అధ్యక్షుడు: ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ఇర్ఫాన్.. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
- ప్రవింద్ జుగ్నాథ్ - మారిషస్ ప్రధానమంత్రి : మారిషస్ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్ జుగ్నాథ్ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.
- పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ - మారిషస్ అధ్యక్షుడు: మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్ అధ్యక్షుడు అయ్యారు.
- చంద్రికా ప్రసాద్ సంతోఖి (చాన్ సంతోఖి), సురినామ్ అధ్యక్షుడు: దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.
- కమలా హ్యారిస్ - అమెరికా ఉపాధ్యక్షురాలు: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన వారే.
ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఐదు దేశాలే కాకుండా ట్రినిడాడ్&టొబాగో, పోర్చుగల్, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి: సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?