ETV Bharat / international

భూమిపై పడనున్న 23 టన్నుల రాకెట్ శిథిలాలు.. ప్రమాదమెంత?

author img

By

Published : Nov 3, 2022, 10:53 PM IST

china rocket debris
చైనా రాకెట్ న్యూస్

Long March 5b Rocket : అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తోన్న చైనా.. ఇటీవల అందుకు అవసరమైన చివరి మాడ్యూల్‌ను గత సోమవారం భారీ రాకెట్‌లో పంపించింది. ఆ రాకెట్‌ ఇప్పుడు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో భూమిపై 23 టన్నుల రాకెట్‌ శిథిలాలు పడనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు

Long March 5b Rocket : చైనాకు చెందిన ఓ భారీ రాకెట్‌ శిథిలాలు భూమిపై పడనున్నాయి. 23 టన్నుల బరువుండే ఈ రాకెట్ శకలాలు ఈ వారాంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ శిథిలాల వల్ల మానవాళికి ఏర్పడే ప్రమాదంపై అంచనా వేస్తున్నారు.

అంతరిక్షంలో చైనా చేపట్టిన న్యూ తియాంగాంగ్‌ స్పేష్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ కేంద్రం నిర్మాణం కోసం డ్రాగన్‌ గత సోమవారం చివరి మాడ్యూల్‌ను భూమి నుంచి పంపించింది. లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌తో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా వెల్లడించింది. అయితే ఈ రాకెట్‌ భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపైకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలై శనివారమంతా కొనసాగుతుంది.

.

దాదాపు 10 అంతస్తుల భవనమంతా పెద్దగా ఉండే ఈ రాకెట్‌ భూవాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ.. కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా రాకెట్‌కు సంబంధించిన శకలాలు ఎక్కడ పడనున్నాయనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే మానవాళికి దీని వల్ల కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ చెబుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. 88శాతం ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో ఇవి పడే అవకాశముందట. అయితే శకలాల్లో చాలా వరకు జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉండటంతో ముప్పు కాస్త తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన ల్యాబొరేటరీ మాడ్యూల్‌ను తరలించేందుకు ఈ రాకెట్‌ను ప్రయోగించడం 2020 నుంచి ఇది నాలుగోసారి కావడం గమనార్హం. అంతకుముందు ప్రయోగించిన మూడు రాకెట్లు కూడా ఇలాగే దిగువ భూకక్ష్యకు చేరుకొని మళ్లీ తిరిగి భూగోళం వైపు పడిపోయాయి. గతేడాది లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ శకలాలు ఎలాంటి నియంత్రణ లేకుండా భూవాతావరణంలోకి ప్రవేశించి మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రాకెట్‌ శకలాలు మలేసియా, ఇండోనేషియా సమీపంలోని ఓ ద్వీపంలో, ఫిలిప్పీన్స్‌ సమీపంలోని ఓ సముద్రంలో పడిపోయాయి.

ఇవీ చదవండి: 'అందుకే ఇమ్రాన్ ఖాన్​ను చంపాలనుకున్నా.. ఒక్కడినే ప్లాన్ చేశా'

రష్యాకు భారత్ షాక్!.. ఆ తీర్మానంపై ఓటింగ్​కు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.