ETV Bharat / crime

Vishaka Crossfire : విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు హతం!

author img

By

Published : Jun 16, 2021, 5:46 PM IST

Updated : Jun 17, 2021, 9:17 AM IST

Vishaka Encounter
Vishaka Encounter

విశాఖ మన్యం.. తుపాకుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున కొయ్యూరు మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

విశాఖ మన్యం మళ్లీ ఎరుపెక్కింది. తుపాకుల మోతలతో దద్దరిల్లింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు డివిజనల్‌ కమిటీ సభ్యులు, ముగ్గురు మహిళలున్నారు. వీరు కాక మరో మహిళా మావోయిస్టు ఎవరన్నది ఇంకా గుర్తించాలి. ఈ ఘటనలో అగ్రనేతలు అరుణ, ఉదయ్‌, జగన్‌ తప్పించుకున్నట్లు సమాచారం.

మృతులు వీరే..
ఎదురు కాల్పుల్లో డివిజనల్‌ కమిటీ సభ్యుల (డీసీఎం) క్యాడర్‌లో ఉన్న సందె గంగయ్య అలియాస్‌ డాక్టర్‌ అశోక్‌, రణదేవ్‌ అలియాస్‌ అర్జున్‌తో పాటు, ఏరియా కమిటీ సభ్యురాలు సంతునాచిక, మహిళా మావోయిస్టులు పాయకే, లలిత మరణించారు. మరో మహిళ వివరాలు తెలియలేదు.

Vishaka Encounter
పోలీసుల ప్రకటన

పక్కా సమాచారంతో దాడి
కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలోని యు.చీడిపల్లి పంచాయతీ తీగలమెట్ట వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి సమీపాన కూంబింగ్‌ చేస్తున్న గ్రేహౌండ్స్‌ బలగాలు అప్రమత్తమై మంగళవారం రాత్రే అటువైపు వెళ్లాయి. ముందు ఒక బృందం వెళ్లాక.. అటవీ ప్రాంతం నలువైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం 9.30 ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, కార్బన్‌, .303 రైఫిల్‌, తపంచా, ఎస్‌బీబీఎల్‌ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

అగ్రనేతలను కాపాడబోయి..
తీగలమెట్ట అడవిలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టుల్లో రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులు అరుణ, ఉదయ్‌, జగన్‌ మరికొందరు అగ్రనేతలున్నట్లు నిఘావర్గాల సమాచారం. ఎదురు కాల్పులు మొదలవగానే వీరిని సురక్షితంగా అడవిని దాటించే క్రమంలో రక్షణగా నిలిచిన మావోయిస్టులు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో ఇద్దరు అరుణ అంగరక్షకులై ఉండొచ్చని సమాచారం.

డాక్టర్‌ అశోక్‌ అందుకే వచ్చారా?
తాజా ఎదురుకాల్పుల్లో హతమైన సందె గంగయ్య చదివింది ఏడో తరగతే అయినా.. ఆ పార్టీ వైద్యబృందంలో ఆయనది కీలక పాత్ర. అందుకే ఆయన్ను డాక్టర్‌ అశోక్‌ అని పిలుస్తారు. సాధారణంగా మావోయిస్టు ముఖ్యనేతలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే చికిత్స కోసం డాక్టర్‌ అశోక్‌ను తీసుకొస్తారు. ఇప్పుడు కూడా ఆయన అందుకే వచ్చారా? అనే వివరాలు సేకరిస్తున్నారు. మావోయిస్టులు కొవిడ్‌ బారిన పడ్డారా? వారికి చికిత్స అందించడానికే ఆయన వచ్చారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గంగయ్య అన్న రాజయ్య 1996లో ఓదెలగుట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. మరో అన్న సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ 2007లో అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. వీరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం. ఒకే గ్రామానికి, కుటుంబానికి చెందిన ముగ్గురు మావోయిస్టు నేతలు వివిధ సందర్భాల్లో చనిపోయారు.

అత్మరక్షణ కోసమే కాల్పులు
'తీగలమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశాలు నిర్వహించి గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని సమాచారం వచ్చింది. వారిని నిరోధించడానికి పోలీసు బలగాలను పంపించాం. మా వాళ్లను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. లొంగిపోవాలని చెప్పినా పట్టించుకోలేదు. ఆత్మరక్షణార్థం తిరిగి కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయినట్లు గుర్తించాం. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వారు లొంగిపోతే మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తాం' అని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు.

మల్కాన్‌గిరిలోనూ ఎదురు కాల్పులు
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మథిలి ఠాణా కులబేడ గ్రామ సమీప అడవుల్లో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని ఎస్పీ రిషికేష్‌ డి.ఖిలారి బుధవారం విలేకరులకు తెలిపారు. మల్కాన్‌గిరి-కొరాపుట్‌ సరిహద్దు అటవీ ప్రాంతంలో సీసీఐ మావోయిస్టుల సమావేశం జరగనున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దీంతో ఎస్‌వోజీ, మల్కాన్‌గిరి డీవీఎఫ్‌ దళాలు అడవిలో జల్లెడ పట్టాయని తెలిపారు. భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, అప్రమత్తమైన జవాన్లు ఎదురు దాడి చేశారని వెల్లడించారు. కొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ ఘటనలో ఒక రైఫిల్‌, 19 తూటాలు, 15 ఏకే-47 తూటాలు, ఒక ఏకే-47 మ్యాగజీన్‌, 4 కిట్‌ బ్యాగులు, ఒక డిజిటల్‌ కెమెరా, డిటొనేటరు, పవర్‌బ్యాంక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

తల్లడిల్లిన తల్లి గుండె

విశాఖ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో... సందె గంగయ్య అలియాస్‌ అశోక్‌ మృతి వార్త తెలుసుకుని ఆయన తల్లి అమృతమ్మ తల్లడిల్లిపోయారు. బీపీతో బాధపడుతున్న అమృతమ్మ.. తమ ఇంటివద్ద గుమిగూడిన జనాన్ని చూసి కీడు శంకించారు. అంతలోనే చిన్న కొడుకు మహేందర్‌ విలపించారు. తమకు కనీసం అధికారులు, పోలీసులు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మీడియా వారు చెప్పేవరకూ తెలియదన్నారు. గంగయ్య తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్‌ పార్టీకి ఆకర్షితుడై ఉద్యమం బాట పట్టాడు.

ఇదీ చదవండి

CM Jagan: కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది.. జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దు: సీఎం జగన్‌

Last Updated :Jun 17, 2021, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.