ETV Bharat / crime

హైదరాబాద్​లో మరో పరువు హత్య.. కత్తులతో 20 సార్లు పొడిచి..

author img

By

Published : May 20, 2022, 9:09 PM IST

Updated : May 21, 2022, 6:50 AM IST

murder
హైదరాబాద్​లో మరో పరువు హత్య

21:07 May 20

కత్తులతో పొడిచి చంపిన నలుగురు దుండగులు

హైదరాబాద్​లో మరో పరువు హత్య.. కత్తులతో 20 సార్లు పొడిచి..

Honor killing in hyderabad: హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే నగరంలో మరో పరువు హత్య జరిగింది. బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద నీరజ్​ పన్వార్​ అనే యువకున్ని.. ఐదుగురు దుండగులు కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబీకులు కక్షగట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. నీరజ్‌ పన్వార్‌ను దుండగులు.. దాదాపు 20 సార్లు కత్తులతో పొడిచినట్టు స్థానికులు చెప్పారు.

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టాస్క్‌ఫోర్స్‌ సహా 4 బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించగా.. 2 ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు, తర్వాత కత్తులతో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.

Honor killing in hyderabad: మార్కెట్‌ క్రయవిక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ బేగంబజార్‌లో హత్యోదంతం స్థానికులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రేమపెళ్లి చేసుకున్న ఓ యువకుడిని అమ్మాయి కుటుంబీకులు కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేశారు. ఇటీవల సరూర్‌నగర్ నాగరాజును నడిరోడ్డుపై అమ్మాయి కుటుంబ సభ్యులు నరికిచంపిన ఘటన మరువకముందే నగరంలో మరొకొటి చోటుచేసుకోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రేమ వివాహం చేసుకున్నందుకే: పెళ్లి అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్​ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్​నాథ్‌తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి 50ఏళ్ల క్రితం వలసొచ్చిన వారి కుటుంబం ఇక్కడే వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్‌టెంపుల్‌లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపగా 'నీరజ్‌-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.

దారుణంగా హత్య: కొన్ని రోజులుగా నీరజ్‌ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు. నిన్న రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్‌ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్‌ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.

కులాంతర వివాహం కారణంగానే..: హత్యోదంతం గురించి తెలుసుకున్న షాహినాయత్‌గంజ్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితులకోసం గాలింపు చేపట్టారు. ఐదుగురు నిందితులు నీరజ్‌పై దాడిచేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.... సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. కులాంతర వివాహం కారణంగానే హత్య జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

"మార్వాడీ అబ్బాయి నీరజ్, యాదవ్ అమ్మాయి సంజన.. ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్లు ఆర్య సమాజ్​లో వివాహం చేసుకున్నారు. అమ్మాయి సంజన వారి కుటుంబ సభ్యులే నీరజ్​ను హత్య చేశారని ప్రాథమికంగా గుర్తించాం. మృతుడు తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. ఈ హత్య కేసులో ఐదుగురు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించాం. కేసు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. ఈ ఘటన 7:30 నిమిషాలకు చోటుచేసుకుంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం." -సతీశ్​ కుమార్, గోశామహల్ ఏసీపీ

నీరజ్‌ హత్య గురించి తెలుసుకున్న బేగంబజార్‌లోని వ్యాపారులంతా ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. వందలాది మంది రహదారిపై బైఠాయించి నిందితులను గుర్తించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, అధికార పార్టీ నేతల హామీతో వ్యాపారులు ఆందోళన విరమించారు. ఘటనను నిరసిస్తూ బేగంబజార్ మర్చంట్స్ అసోసియేషన్​ ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చింది.

"మా అబ్బాయి ఏడాది క్రితం నీరజ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నీరజ్‌ వివాహం తర్వాత అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. అమ్మాయి కుటుంబం కక్షగట్టి కిరాతకంగా హత్య చేసింది. నీరజ్​, సంజనకు 4 నెలల బాబు ఉన్నాడు. ఇంటి సమీపంలో దుకాణానికి వెళ్లినప్పుడు నీరజ్‌ను చంపారు. బైకులపై ఐదుగురు వచ్చి నా కుమారుడిని చంపినట్టు పోలీసులు వీడియోలు చూపించారు." - మృతుడి తండ్రి రాజేందర్‌

ఘటనాస్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరుస హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated :May 21, 2022, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.