ETV Bharat / city

పాలనలో తేడా చూడండి.. ఇంటింటికీ మంచి చేస్తున్నాం: సీఎం జగన్

author img

By

Published : Jul 15, 2022, 12:46 PM IST

Updated : Jul 16, 2022, 3:59 AM IST

కరోనా సమయంలో ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నా వాహనమిత్ర పథకం అమలు చేశామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో వాహనమిత్ర నగదు బదిలీని సీఎం ప్రారంభించారు. వైఎస్సార్‌ వాహనమిత్ర కింద 2.60 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతోందన్నారు. రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న డ్రైవర్లకు...వరుసగా నాలుగో ఏడాది వాహనమిత్ర కింద ఫలాలు అందిస్తున్నామన్నారు.

YSR VAHANA MITRA:
YSR VAHANA MITRA:

రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనకు, తమ పాలనకు తేడా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను కోరారు. రాష్ట్రంలో లంచాలు, కుల, మత, వివక్షకు తావు లేకుండా.. రాజకీయాలకు అతీతంగా ఇంటింటికీ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ‘అప్పుడు ఒక సీఎం ఉన్నారు.. ఇప్పుడు ఒక సీఎం ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అంతే బడ్జెట్‌. మరి అప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోయారు? జగన్‌ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడని ప్రజలు ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వ అప్పుల కన్నా ఇప్పుడు చేస్తున్న అప్పులు తక్కువ. గతంలో దోచుకుని పంచుకునేవారు. ఇప్పుడు ఎవరూ దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు. ఇంటింటికీ మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఇది. అన్ని సామాజికవర్గాలు, పేదల గురించి నిరంతరం ఆలోచన చేస్తుంది’ అని పేర్కొన్నారు.

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో శుక్రవారం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. సీఎం మీట నొక్కి రాష్ట్రంలోని దాదాపు 2.61 లక్షల మంది ఆటో, క్యాబ్‌, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో రూ.261.51 కోట్ల ఆర్థికసాయం జమ చేశారు. అంతకుముందు సీఎం ఖాకీ చొక్కా ధరించి మహిళా లబ్ధిదారు నడిపే ఆటో ఎక్కారు. అక్కడే ఉన్న పలువురు లబ్ధిదారులతో కలిసి ఫొటో దిగారు. రవాణా శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

రూ.వెయ్యి కోట్ల సాయం అందించాం: సభలో సీఎం మాట్లాడుతూ ‘ఆటో, ట్యాక్సీలు నడుపుతూ రోజూ లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న డ్రైవర్లకు ఇప్పటివరకు ఒక్కొక్కరికీ రూ.40 వేల చొప్పున రూ.1000 కోట్లపైన సాయం అందించాం. ప్రజల గురించి ఇంతలా ఆలోచించిన ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు. పాదయాత్రలో డ్రైవర్‌ సోదరుల కష్టాలు చూశాను.. విన్నాను. వారిని ఆదుకుంటానని గతంలో ఏలూరు సభలో మాటిచ్చా. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నా. కరోనా కష్టకాలంలోనూ అండగా ఉన్నా. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ప్రజలు పడుతున్న కష్టమే ఎక్కువని గుర్తించి ముందుగానే డబ్బులు వేశాం. ఈ డబ్బులు దేనికి వాడుతున్నారని అడగను. వాహనదారులు అపరాధరుసుం చెల్లించే పరిస్థితి రాకూడదు. ప్రయాణికుల రక్షణ నిమిత్తం బీమా, ఫిట్‌నెస్‌ మాత్రం కచ్చితంగా చేయించుకోవాలి. గత ప్రభుత్వం అయిదేళ్లలో అపరాధ రుసుం కింద రూ.30 కోట్లపైన వసూలు చేస్తే మనం ఈ మూడేళ్లలో రూ.కోటి మాత్రమే కాంపౌండ్‌ ఫీజు కింద వసూలు చేశాం. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి’ అన్నారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజిని, బూడి ముత్యాలనాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆహారం కోసం తోపులాట: సభకు వచ్చిన అధికారులు, సిబ్బంది, ప్రజలు ఆహారం అందక నానా పాట్లు పడ్డారు. మధ్యాహ్నం సమావేశం ముగియగానే ఒక్కసారిగా జనం మైదానంలోకి వచ్చారు. ఆహారం సరిగా అందకపోవడంతో వారంతా ఆహారపొట్లాలు తెచ్చిన వాహనాల వద్దకు పరుగుపరుగున వెళ్లి అందినకాడికి లాక్కున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి చాలా డబ్బాలు కిందపడి భోజనం నేలపాలయింది. తిండి దొరకని వందల మంది.. నిర్వాహకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉసూరుమంటూ వెనుదిరిగారు.

డ్రైవర్లు ప్రచారకర్తల్లా పనిచేయాలి: మంత్రి విశ్వరూప్‌

వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం లబ్ధిదారులు ప్రచారకర్తలుగా, జగనన్న సైనికులుగా పనిచేయాలని రవాణాశాఖ మంత్రి విశ్వరూప్‌ సభలో వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర సభలో ఆయన మాట్లాడుతూ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. ఇన్ని కార్యక్రమాలను ఎవరూ అమలు చేయడం లేదన్నారు. గతంలో ఎవరూ చేయలేదనీ చెప్పారు. తెదేపా వస్తే మాత్రం ఈ పథకాలు ఆగిపోవడం తథ్యమన్నారు. ఈ నేపథ్యంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు తమ వాహనాల్లో ప్రయాణించే వారికి పథకాల గురించి వివరించి చైతన్యం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

Last Updated :Jul 16, 2022, 3:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.