ETV Bharat / city

ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఓటు వేయని బాలకృష్ణ, గోరంట్ల

author img

By

Published : Jul 18, 2022, 12:45 PM IST

Updated : Jul 18, 2022, 5:17 PM IST

Presidential election votes: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా మొత్తం 172 మంది శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు వ్యక్తిగత కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు. వైసీపీ శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి హైదరాబాద్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిగా ఓటు వేస్తే.. ఆఖరున గుంటూరు పశ్చిమ శాసనసభ్యు మద్దాల గిరి ఓటు వేశారు. రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలు ద్రౌపదీ ముర్ముకే మద్దతు పలకటంతో ఓటింగ్ ఏకపక్షంగానే కొనసాగింది.

ysrcp leaders along with cm jagan casted their votes for presidential elections
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్

Presidential election votes: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ సమయం ఉన్నప్పటికీ.. మద్యాహ్నం 1.30 గంటలకే 95 శాతం మేర పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదయం 10 గంటల సమయానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, శాసనసభ్యులు శాసనసభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి ఓటు వేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్

శాసనసభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 172 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. తొలి ఓటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేస్తే.. చివరన గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాల గిరి ఓటు వేశారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో ప్రత్యేకంగా పీపీఈ కిట్​తో వచ్చి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు వ్యక్తిగత కారణాలతో విదేశాల్లో ఉన్న రీత్యా.. ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. వైకాపా శాసన సభ్యుడు మహీధర్ రెడ్డి ఎన్నికల సంఘం ముందస్తు అనుమతితో హైదరాబాద్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార వైకాపాతో పాటు.. తెలుగుదేశం పార్టీ కూడా భాజపా ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతు పలకటంతో పోలింగ్ ప్రక్రియ ఏకపక్షంగానే కొనసాగింది.

నిర్దేశిత సమయం 5 గంటల కంటే ముందుగానే రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమయం పూర్తి అయ్యేంత వరకూ అధికారులు వేచి చూశారు. బ్యాలెట్ బాక్సును భద్రపరిచి.. రేపు ఉదయం ఢిల్లీకి తరలిస్తారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 18, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.