ETV Bharat / city

Union budget 2022: కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు మొండిచెయ్యి

author img

By

Published : Feb 2, 2022, 7:31 AM IST

Union budget 2022: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. హామీలు సహా ఇతరాలకు వేటికీ తెలంగాణ నోచుకోలేదు. పన్నుల్లో వాటాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 17వేల కోట్లకు పైగా నిధులు రానున్నాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు కేంద్రం రుణంగా ప్రతిపాదించిన లక్ష కోట్లలో తెలంగాణకు రూ.3 వేల కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకి మొండిచెయ్యి
కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకి మొండిచెయ్యి

Union budget 2022: తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్ర బడ్జెట్‌లో మరోమారు నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌ వేళ తెలంగాణ ప్రభుత్వం బాగానే ఆశించింది. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులకు పలు విజ్ఞప్తులు కూడా పంపారు. మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​ లేఖలు సైతం రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ ప్రతిపాదనలు, అభ్యర్థనలను కేంద్రం ముందు ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రావాల్సిన 30,751 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఆర్థికసంఘం రాష్ట్రానికి చేసిన ప్రత్యేక సిఫారసులకు తిరస్కరించడం సబబు కాదని... వాటిని గౌరవించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎక్కడా చోటు దక్కలే..

కాళేశ్వరం లేదా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్​ వంటి హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొవిడ్​, లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు తగ్గిన వేల తోడ్పాటు ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. రుణ పరిమితినీ పెంచాలని విజ్ఞప్తి చేసింది. వీటన్నింటికీ కేంద్ర బడ్జెట్‌లో ఎక్కడా చోటు లభించలేదు. తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు దక్కలేదు.

ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో 25శాతం కోత..

2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్నుల్లో తెలంగాణ వాటాగా కేంద్రం నుంచి 17,165 కోట్ల 59 లక్షల రూపాయలు రానున్నాయి. గిరిజన విశ్వవిద్యాలయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 40 కోట్ల రూపాయలు కేటాయించారు. అన్ని రకాల కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను మొత్తమ్మీద ఐదు నుంచి ఆరు శాతం వరకు నిధులు పెంచారు. దీంతో ఆ మేరకు రాష్ట్రానికి ఆయా పథకాల్లో కేటాయింపులు రానున్నాయి. అయితే ముఖ్యమైన పథకాల్లో కోతలు విధించారు. కీలకమైన జాతీయ ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో 25శాతం తగ్గించగా... ఎరువుల రాయితీలో కోత విధించారు. భారత ఆహార సంస్థకు సంబంధించి కూడా మూడో వంతు దాదాపు రూ.65 వేల కోట్ల కోతలు పడ్డాయి. ఈ ప్రభావం కనీస మద్ధతుధరకు పంటల కొనుగోళ్లపై పడనుంది. ఇప్పటికే పంటల కొనుగోళ్ల సమస్య ఉంది. సహజంగా తెలంగాణపై ఈ ప్రభావం ఉండనుంది.

రాష్ట్రానికి మూడున్నర వేల కోట్లు!

రాష్ట్రాలకు రుణపరిమితి జీఎస్​డీపీలో 4 శాతానికి పెంచారు. అయితే విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే 0.5 శాతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో 3.5 శాతానికి లోబడే జీఎస్​డీపీలో తెలంగాణకి రుణాలు తీసుకునే వెసులుబాటు దక్కనుంది. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఇచ్చే రుణాల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఈమారు భారీగా పెంచింది. 50 ఏళ్ల కాలపరిమితికి ఎలాంటి వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయలను రాష్ట్రాలకు రుణంగా ఇవ్వనున్నట్లు కేంద్రం బడ్జెట్‌ పేర్కొంది. ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఇందుకు సంబంధించిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకారం రాష్ట్రానికి మూడు నుంచి మూడున్నర వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదీచూడండి: Polavaram: పోలవరానికి ఇలా.. కెన్​-బెత్వాకు అలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.