ETV Bharat / city

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోబోమంటూ ఉపాధ్యాయుల లేఖల సమర్పణ

author img

By

Published : Aug 17, 2022, 7:39 AM IST

రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ ఆధారిత హాజరు నమోదుపై ఉపాధ్యాయులు సహాయ నిరాకరణ ప్రకటించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోబోమంటూ అనేక మంది ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. ప్రభుత్వం డివైజ్‌, డేటా అందిస్తేనే హాజరు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు.

ఉపాధ్యాయుల లేఖల సమర్పణ
ఉపాధ్యాయుల లేఖల సమర్పణ

ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ ఆధారిత హాజరు నమోదుపై ఉపాధ్యాయులు సహాయ నిరాకరణ ప్రకటించారు. సొంత సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, హాజరు నమోదు చేయబోమంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు లేఖలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం డివైజ్‌లు, డేటా ఇస్తేనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, వివరాలు నమోదు చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా హాజరు నమోదు చేసినా సెలవు పెట్టాల్సిందేనని, దీన్నే జీతాలకు ప్రామాణికంగా తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయుల సెల్‌ఫోన్లలోనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్‌ గురించి పట్టించుకోకుండా హాజరు నమోదు తప్పదని వెల్లడించింది. దీన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. యాప్‌ ద్వారా ముఖ ఆధారిత హాజరు నమోదుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌, జేడీ రామలింగంతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు అమలు చేయాలని, హాజరు నమోదులో ఉన్న సమస్యలను సవరించడానికి ప్రయత్నిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఇచ్చే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చే వరకు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దంటూ ఫ్యాప్టో ప్రకటించింది.

మొదటిరోజే అవస్థలు..: రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ ఉదయం ఒకే సమయంలో ఈ-హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నించగా లోడింగ్‌ ఫెయిల్‌.. మళ్లీ ప్రయత్నించాలంటూ మెసేజ్‌లు వచ్చాయి. కొన్నిచోట్ల సిగ్నల్స్‌ లేకపోవడంతో యాప్‌ ఓపెన్‌ కాలేదు. కొందరు మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రయత్నించారు. ఉదయం పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి హాజరు నమోదు చేసేందుకు ఫోన్లతో కుస్తీలు పట్టాల్సి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హాజరు వేయలేక చాలా మంది ఉపాధ్యాయులు విసిగిపోయారు. చాలా పాఠశాలలో మొదటి పీరియడ్‌ హాజరు నమోదుకే సరిపోయింది. ఆ మేరకు విద్యార్థులు అభ్యసన కోల్పోయారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం చేయడంతో కొందరు ఇప్పటికీ డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. డౌన్‌లోడ్‌ చేసుకున్న వారిలోనూ చాలామంది హాజరు వేయలేదు. వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌లో యాప్‌తో హాజరు నమోదుకు తాము వ్యతిరేకమని రాష్ట్రోపాధ్యాయ, తెలుగునాడు ఉపాధ్యాయ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి.

పొన్నా భాస్కర ఫణికుమార్‌ అనే నేను కృష్ణా జిల్లా మల్లంపూడి ఎంపీయూపీఎస్‌ పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్నాను. నేను నా మొబైల్‌ ఫోన్‌ వినియోగాన్ని తగ్గించుకోదలిచాను. ఛార్జీలు పెరగడం వల్ల డేటా వినియోగాన్ని నిలిపివేస్తున్నాను. ఫోన్‌ను పాఠశాలకు తీసుకురావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఏ యాప్‌లోనైనా పని చేయాల్సి వస్తే అందుకు తగిన డేటా, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను అందిస్తే చేస్తాను. - ప్రధానోపాధ్యాయుడికి ఓ ఉపాధ్యాయుడి లేఖ

బయోమెట్రిక్‌ ఉండగా ఇదెందుకు?: ‘‘బయోమెట్రిక్‌ విధానం ఉండగా.. ఒక్క ఉపాధ్యాయులకే ముఖ ఆధారిత హాజరు ఎందుకు పెట్టారు? దీన్ని వెంటనే తొలగించాలి. బోధనేతర కార్యక్రమాలకు ప్రత్యేక విభాగం లేనందున ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆ పనులతో సతమతమవుతున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి కొత్తవి సృష్టించడం విద్యాశాఖలో అలవాటుగా మారింది. విద్యా రంగ సంస్కరణల్లో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేనిపక్షంలో ఆందోళన తప్పదు’’ - కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ

మొదటిరోజే చిక్కులు: ‘‘ఉపాధ్యాయులు తమ సొంత ఫోన్ల నుంచి హాజరు నమోదు.. ఉదయం 9 గంటలు దాటితే సాధారణ సెలవు పెట్టాలనే నిబంధనను వ్యతిరేకిస్తున్నాం.సెల్‌ఫోన్‌లో నెట్‌ సౌకర్యం, యాప్‌ డౌన్‌లోడ్‌ కాకపోవడం, హాజరు నమోదు అప్‌లోడ్‌ కాకపోవడం లాంటి సమస్యలతో చాలామంది తొలిరోజే ఆవేదన చెందారు. గతంలో ప్రభుత్వమే డివైజ్‌లు ఇచ్చి, హాజరు నమోదు చేపట్టింది. ఇప్పుడు అలాగే డివైజ్‌, డేటా ఇస్తే హాజరు నమోదు చేస్తాం’’ - వెంకటేశ్వర్లు, మంజుల, ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు, ఫ్యాప్టో

ప్రధానోపాధ్యాయుడికి ఉపాధ్యాయుల లేఖ: ‘‘మేము పాఠశాలకు స్మార్ట్‌ ఫోన్‌లు తీసుకురావడం లేదు. ప్రభుత్వమే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌, డేటా ఇచ్చి మాతో ఆన్‌లైన్‌ వర్క్‌ చేయించుకోవాలి’’ - గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు బీకేఆర్‌ జడ్పీహెచ్‌ఎస్‌

‘‘ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చేవరకు హాజరు యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. ఒకవేళ డౌన్‌లోడ్‌ చేస్తున్నా హాజరు నమోదు చేయవద్దు’’ - ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.