ETV Bharat / city

Yanamala: 'పథకాలు రద్దు చేశారు.. సొంత పత్రికకు కోట్లు దోచి పెడుతున్నారు'

author img

By

Published : Jul 6, 2022, 1:10 PM IST

కన్నింగ్​నెస్​ ఐడియాలజీతో సీఎం జగన్ బిజినెస్
కన్నింగ్​నెస్​ ఐడియాలజీతో సీఎం జగన్ బిజినెస్

Yanamala Comments on Jagan: అవార్డుల పేరుతో వాలంటీర్లకు రూ.485.44 కోట్లు దోచిపెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు వార్తా పత్రికల కోనుగోళ్లు అంటూ సరికొత్త దోపిడీకి తెరతీశారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వాలంటీర్లతో సొంత పత్రిక సాక్షి కొనుగోలు చేసేలా చేసి.. సొంత ఖజానాకు ఆ డబ్బును మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పథకాలు రద్దుచేసి సొంత పత్రికకు మాత్రం రూ.కోట్లు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ కన్నింగ్​నెస్ ఐడియాలజీతో బిజినెస్ చేస్తున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అవార్డుల పేరుతో వాలంటీర్లకు రూ.485.44 కోట్లు దోచిపెట్టిన జగన్.. ఇప్పుడు వార్తా పత్రికల కోసం అంటూ ఒక్కో వాలంటీర్​కు నెలకు రూ.200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రతి నెల రూ.200 చొప్పున చెల్లిస్తే.. నెలకు రూ.5.50 కోట్లు ఖర్చువుతుందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ.. వారితో సొంత పత్రిక సాక్షి కొనుగోలు చేసేలా చేసి.. తిరిగి ఆ డబ్బును తన సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని దుయ్యబట్టారు.

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్న జగన్.. తన సొంత పత్రికను తన పార్టీ కార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా ? అని నిలదీశారు. ప్రజలకు ఉపయోగపడే విదేశీ విద్య, అన్నక్యాంటీన్, దుల్హాన్ పథకం, ఆదరణ పథకాలు రద్దు చేసిన జగన్.. తన సొంత పత్రికకు మాత్రం కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజలపై పన్నుల రూపంలో మోయలేని భారాలు మోపుతూ.. ఆ మొత్తాలను సొంతపత్రిక, ఛానల్‌కు జగన్ మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఒక్క సాక్షి పత్రికకే ముడేళ్లలో రూ.280 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారన్నారు. ఈ సొమ్మంతా ప్రజలదేనన్న యనమల.. జగన్ లూటీ చేసి తిన్న ప్రతి రూపాయిని కక్కించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.