"నిబంధనలు ఉల్లంఘిస్తారా..?" రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

author img

By

Published : Apr 13, 2022, 3:53 PM IST

Updated : Apr 14, 2022, 4:19 AM IST

విపత్తు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తారా ?

విపత్తు చట్టం నిబంధనలను రాష్ట్రం ఉల్లంఘించిందని.. వైకాపా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం విషయంలో రాష్ట్ర సర్కారు తీరును తప్పుబట్టిన అత్యున్నత ధర్మాసనం.. రాష్ట్ర విపత్తు నిధులు పీడీ ఖాతాలకు మళ్లించవద్దని ఆదేశించింది.

స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిధులను వ్యక్తిగత డిపాజిట్‌(పీడీ) ఖాతాలకు మళ్లించొద్దని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్‌-19 కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఉద్దేశించిన నిధులను ఇతర ఖాతాలకు మళ్లించడాన్ని జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం చాలా తీవ్రమైన అంశంగా అభివర్ణించింది. విపత్తుల నిర్వహణ చట్టం (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌) నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను పీడీ ఖాతాలకు మళ్లిస్తోందని పిటిషనర్‌ పల్లా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గౌరవ్‌ బన్సల్‌ బుధవారం నివేదించినప్పుడు ధర్మాసనం ఈమేరకు స్పందించింది. ‘రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌-2005లోని సెక్షన్‌ 46(2) కింద పేర్కొనని ఇతర పనుల కోసం చట్టవిరుద్ధంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ఉపయోగిస్తోంది.

కొవిడ్‌-19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం ఇప్పించేందుకు కోర్టు నిరంతరం ప్రయత్నిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను పీడీ ఖాతాలకు మళ్లించడం చట్ట విరుద్ధమే కాకుండా కోర్టు ధిక్కారం కిందికి కూడా వస్తుంది’ అని గౌరవ్‌ బన్సల్‌ ధర్మాసనానికి విన్నవించారు. ఈ వాదనలను విన్న అనంతరం కోర్టు ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి, ఈనెల 28వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులు మళ్లించొద్దని, ఒకవేళ ఇప్పటికే నిధులను మళ్లించి ఉంటే వాటిని చట్టం కింద పేర్కొనని ఇతరత్రా అవసరాల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ద్రవ్య వినిమయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఆర్థికశాఖ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యాభాటీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇదివరకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేసే అంశంపై నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దాని ప్రకారం కొవిడ్‌ కారణంగా వ్యక్తిని పోగొట్టుకున్న కుటుంబసభ్యులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: సామాన్య భక్తులను స్వామి వారికి దూరం చేసేందుకే ఈ నిర్ణయాలు - పయ్యావుల

Last Updated :Apr 14, 2022, 4:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.