ETV Bharat / city

40 ప్రేమ కథల 'కడలి'

author img

By

Published : Nov 17, 2019, 12:06 AM IST

Updated : Nov 17, 2019, 8:47 AM IST

కడలి.. అంటే సముద్రం. పైకి ఆహ్లాదంగా కనపడే సముద్రం లోపల ఎంతో సంఘర్షణకు గురవుతుంటుంది. అలా 40 మంది జంటల  సంఘర్షణలను 40 ప్రేమ కథలుగా మలిచి తన తొలి పుస్తకాన్ని విడుదల  చేసింది కడలి సత్యనారాయణ. నటి, నిర్మాత రేణు దేశాయి చేతుల మీదుగా విడుదలైన 'లెటర్స్​ టు లవ్' పుస్తకం తొలిరోజే 500కుపైగా ప్రతులు అమ్ముడుపోయాయి. ప్రముఖ రచయితల మన్ననలు పొందాయి. ​

40 ప్రేమ కథల 'కడలి'

40 ప్రేమ కథల 'కడలి'

కడలి సత్యనారాయణ... ఈ పేరు వినగానే కడలి ఇంటి పేరు.. సత్యనారాయణ వ్యక్తి పేరు అనుకుంటాం. కానీ ఈ పేరు 'లెటర్స్ టు లవ్' పుస్తక రచయిత్రిది. ఆ పుస్తకం కంటే ముందు ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన కడలికి తన తాతయ్య సత్యనారాయణ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే కడలికి తెలుగు సాహిత్యంలో బీజం వేసింది ఆయనే. మనవరాలి ముద్దుముద్దు మాటలకు మురిసిపోయే తాత... కవి సమ్మేళనాలు, రచయితల సమావేశాలకు వెంట తీసుకెళ్లేవాడు. చెకుముకి, చందమామ కథల పుస్తకాలు చదివించేవాడు. అలా బాల్యంలోనే పుస్తకాలతో స్నేహం చేసిన కడలి... 2010లో భ్రూణహత్యలపై కడలి రాసిన తొలి కవిత ఓ దినపత్రికలో అచ్చయింది. దీంతో సత్యనారాయణ ఆనందానికి అవధులు లేవు. కడలిని మంచి రచయితగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. కాలక్రమంలో సత్యనారాయణ కాలం చేశారు. అది తట్టుకోలేకపోయిన కడలి... తాతయ్య తనతోనే ఉన్నారనే భావనతో సత్యనారాయణ పేరును తన పేరు పక్కన చేర్చుకొని... కడలి సత్యనారాయణగా మారింది.

చలం తరహాలో..

చిన్నప్పటి నుంచి చదివిన చలం రచనలు కడలిని స్థిమితంగా ఉండనివ్వలేదు. మహిళలు, సమాజంపై ఆయన రచనలు కడలి ఆలోచన ధోరణిని మార్చివేశాయి. మహిళల పట్ల సమాజపు పోకడలను ప్రశ్నించే ప్రయత్నానికి నాంది పలికాయి. ఎంతోమంది సాహితీవేత్తలు, యువ కవులతో సాన్నిహిత్యం పెరిగేలా చేశాయి. ఈ క్రమంలోనే చలం ప్రేమలేఖల తరహాలోనే తాను కూడా ప్రేమలేఖలు రాయాలని సంకల్పించుకున్న కడలి... తనకు ఎదురైన అనుభవాలు, తన కళ్లముందు కదలాడే జంటల కథలను ప్రేమ కథలుగా మలిచి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసింది. ఫేస్ బుక్​లోని కవిసంగమం గ్రూప్​లోని ఎంతోమంది కవులు, రచయితలు కడలి ప్రేమ లేఖలను గుర్తించి అభినందించారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టింది. అలా... 16 ఏళ్ల అమ్మాయి నుంచి 50 ఏళ్ల మహిళలపై వివిధ కోణాల్లో 40 ప్రేమ లేఖలు రాసింది. వాటిని లెటర్స్ టు లవ్ పేరుతో సంపుటిగా తొలి పుస్తకాన్ని విడుదల చేసింది.

తొలి ప్రయత్నంగా 'ప్రేమ':

నేటి యువతరానికి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకే తొలి ప్రయత్నంగా ప్రేమను ఎంచుకున్నానని చెబుతోన్న కడలి... పుస్తకాన్ని పాఠకులకు చేరవేసేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చిందని వివరించింది. ప్రముఖ రచయితలు వెంకట సిదారెడ్డి, బెజవాడ మహితో పాటు పలువురు రచయితల ప్రోత్సాహం, అన్వీక్షికి పబ్లికేషన్ ద్వారా ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల చేసింది. విడుదలైన తొలి రోజే 500కు పైగా ప్రతులు అమ్ముడుపోవడం, చదివిన సీనియర్ రచయితలంతా ఒక్కో ప్రేమకథలోని ఒక్కో భావాన్ని సమీక్షిస్తూ కడలిని ప్రశంసలతో ముంచెత్తారు. తొలి పుస్తకం విజయవంతం అయినందున ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్న కడలి... ఆన్​లైన్ లైంగిక వేధింపులపై మరో పుస్తకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

తెలుగు సాహిత్యంలోనే జీవితం:

ఎంఏ ఇంగ్లీష్ చదివిన కడలి... తెలుగు సాహిత్యంలోనే తన జీవితాన్ని వెతుక్కుంది. యువతరమంతా పుస్తక పఠనంపై అభిరుచి పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆన్​లైన్​లో కడలి పుస్తకానికి మంచి డిమాండ్ ఉంది. సామాజిక మాద్యమాల్లోనూ 'లెటర్స్ టు లవ్ పై ప్రశంసల జల్లు కురుస్తుండటం వల్ల... తన తదుపరి రచనలపై దృష్టి పెట్టింది కడలి సత్యనారాయణ.

ఇవీ చూడండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి

sample description
Last Updated : Nov 17, 2019, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.