ప్రికాషనరీ డోస్​ను వేగవంతం చేయండి: సెక్రటరీ కృష్ణబాబు

author img

By

Published : May 12, 2022, 7:09 PM IST

Health Secretary Krishna Babu

Health Secretary Krishna Babu: హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషనరీ డోస్​ను వేగవంతం చేయాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 104 కాల్ సెంటర్​ను వినియోగిస్తామన్నారు. ఫీవర్ సర్వేను తేలిగ్గా తీసుకోవద్దని కలెక్టర్లకు కృష్ణ బాబు ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 104 కాల్ సెంటర్​ను వినియోగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు తెలిపారు. 104 కాల్ సెంటర్‌ను ఈ వారంలో బలోపేతం చేస్తామన్నారు. సిబ్బంది తీరు, ఆరోగ్య శ్రీ సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చేయవొచ్చన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెనువెంటనే ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఫీవర్ సర్వేను తేలిగ్గా తీసుకోవద్దని కలెక్టర్లకు కృష్ణ బాబు ఆదేశించారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషనరీ డోస్​ను వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాన్ని చేరుకునేలా స్పెషల్ డ్రైవ్​ను చేపట్టాలన్నారు. జిల్లాల్లో క్యాడర్ వారీగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రతినెలా శిక్షణ ఇవ్వాలని.. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్​తో మరణించిన వారికి పరిహారం చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఎన్​హెచ్​ఎం సిబ్బంది సర్దుబాటు, ఆస్పత్రుల్లో ఫైర్​సేఫ్టీ ఆడిట్, ఎన్వోసీ తదితర అంశాలపై సమీక్షించాలన్నారు. ఫైర్ సేఫ్టీ ఆడిట్​కు సంబంధించి అన్ని ఆస్పత్రుల మాస్టర్​ డేటా అప్​లోడ్​కు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈనెల 30లోగా పోస్టుల్ని భర్తీ చేయాలన్న సీఎం ఆదేశాల్ని అమలుచేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులకొచ్చే పేదలకు సేవలందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని సూచించారు. ఆస్పత్రుల నుంచి పేదలు సంతోషంగా తిరిగి ఇంటికెళ్లాలన్నదే సీఎం అభిమతమన్న కృష్ణబాబు.. అందుకనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలన్నారు. కొవిడ్​కు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ ఈనెల 25లోగా పంపించాలన్నారు. ఆ తర్వాత వచ్చే బిల్లుల విషయంలో సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

మందుల కొనుగోలుకు రూ. 650 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఏ ఒక్క ప్రభుత్వ ఆస్పత్రితోనూ మందుల కొరత అనేది రాకూడదని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు పరికరాలు సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు విషయంలో డీఎంఈ, డీహెచ్​లు బాగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీకి సిస్టంపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సూచించారు. మహాప్రస్థానం కోసం అదనపు వాహనాల్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా, టీచింగ్ ఆస్పత్రులతోపాటు ఇతర దావఖానాలకు కూడా మహాప్రస్థానం సేవల్ని విస్తరిస్తామని ప్రిన్సిపల్​ సెక్రటరీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.