ETV Bharat / city

HIGH COURT: విచారించకుండా అనుమతి రద్దు సరికాదు - హైకోర్టు

author img

By

Published : Jun 7, 2022, 9:38 AM IST

HIGH COURT: విచారణ పూర్తిచేయకుండా చౌక ధరల దుకాణం అనుమతి రద్దు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారించకుండా దుకాణం రద్దుకు ఉత్తర్వులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది.

HIGH COURT
HIGH COURT

HIGH COURT: విచారణ పూర్తిచేయకుండా చౌక ధరల దుకాణం అనుమతి రద్దు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారించకుండా దుకాణం రద్దుకు ఉత్తర్వులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఓ చౌక ధరల దుకాణం అనుమతులను రద్దు చేస్తూ అప్పట్లో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగా రావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. వాల్మీకిపురం మండలం చింతపర్తిలో (విభజనకు పూర్వం చిత్తూరు జిల్లాలో ఉంది) సరకుల పంపిణీలో డీలర్‌ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ 2020, సెప్టెంబరులో దుకాణం అనుమతి రద్దు చేశారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ డీలర్‌ శ్రీనివాసులు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, సక్రమంగా విచారణ నిర్వహించకుండా అనుమతి రద్దు చేశారన్నారు. పిటిషనర్‌ అలవాటు ప్రకారం అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకే రద్దు చేశామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

సంయుక్త కలెక్టర్‌ ఉత్తర్వులపై అభ్యంతరముంటే కలెక్టర్‌ వద్ద అప్పీల్‌ చేసుకోవాలని, హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. గతంలోనూ దుకాణం అనుమతి రద్దు చేస్తే పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో తుది విచారణ నిర్వహించాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించిందని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా మళ్లీ అదే దుకాణంలో సోదాలు నిర్వహించి అనుమతి రద్దు చేశారన్నారు. న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాలను దాటవేసేందుకు మరోసారి సోదాలు చేశారని తప్పుపట్టారు. విచారణ జరపకుండా చౌకధరల దుకాణం రద్దుకు ఉత్తర్వులివ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. కార్డుదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా సరకును పిటిషనర్‌కు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాజాగా విచారించేందుకు సంయుక్త కలెక్టర్‌కు స్వేచ్ఛనిచ్చారు.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.