Heroin Case: హెరాయిన్‌ కేసు మూలాలు దిల్లీలోనే..

author img

By

Published : Sep 21, 2021, 9:02 AM IST

Heroin Case

అఫ్గానిస్తాన్ నుంచి తీసుకొస్తుండగా గుజరాత్‌లోనే పట్టుబడిన హెరాయిన్ డొంక మెల్లగా కదులుతోంది. దిల్లీ వ్యక్తినే సూత్రధారిగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారం పేరుతో విజయవాడలో కంపెనీ ప్రారంభించారని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ వ్యవహారంతో విజయవాడకు సంబంధం లేదని పోలీసులు అంటున్నారు.

గుజరాత్ హెరాయిన్‌ కేసులో డొంక కదులుతోంది. దిల్లీ వ్యక్తినే సూత్రధారిగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొందరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలో కంపెనీ ప్రారంభించిన సుధాకర్‌ను విచారిస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారం పేరుతో విజయవాడలో కంపెనీ ప్రారంభించారని ఆరోపణలు వస్తున్న క్రమంలో.. హెరాయిన్‌ వ్యవహారంతో విజయవాడకు సంబంధం లేదని పోలీసులు అంటున్నారు.

గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్లు విలువైన హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా దిల్లీ చేర్చాలనేది మాఫియా వ్యూహమని అధికారులు గుర్తించారు. నిఘా సంస్థలకు అనుమానం రాకుండా విజయవాడ చిరునామాతో కంపెనీ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి వాసి సుధాకర్‌ను పావుగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుధాకర్‌ భార్య పేరుతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించినట్లు కనుగొన్నారు.

జూన్‌లో టాల్కం పౌడర్‌ ముసుగులో హెరాయిన్‌ దిగుమతైనట్లు అధికారులు గుర్తించారు. దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకూ హెరాయిన్‌ తరలించినట్లు చెబుతున్నారు. ఐదు రోజుల కిందట సుధాకర్ దంపతులను డీఆర్ఐ అదుపులోకి తీసుకొంది. సుధాకర్‌ సమాచారం ఆధారంగా అహ్మదాబాద్, దిల్లీ సహా చెన్నైలో సోదాలు చేశారు. సుధాకర్‌ దంపతులతో పాటు మరికొందరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.

గతంలో విశాఖలో ఉద్యోగం చేసిన సుధాకర్ 8 ఏళ్లుగా చెన్నైలో నివాసం ఉంటున్నాడు. సిమెంట్‌ కంపెనీలో లాజిస్టిక్‌ మేనేజర్‌గా పనిచేసిన సుధాకర్‌.. పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల వ్యవహారంపై పట్టు సాధించాడు. డ్రగ్స్ ముఠాల్లో కొందరితో సుధాకర్‌కు పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. పరిచయాలతోనే విజయవాడలో కంపెనీ ప్రారంభించాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్‌ భార్య వైశాలి పుట్టిల్లు విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉంది. విజయవాడ చిరునామాతోనే కంపెనీని రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించారు.

విజయవాడ చిరునామాతో కంపెనీ ఉన్నా కార్యకలాపాలేవీ లేవని గుర్తించారు. మత్తు ముఠాల సభ్యులకు సుధాకర్ పావుగా మారినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఎగుమతి-దిగుమతి కోడ్ ఇస్తే కమీషన్‌ చెల్లిస్తామంటూ ఉచ్చులోకి లాగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టెర్రర్‌ ఫండింగ్‌ ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ డీఆర్‌ఐ అధికారుల ఆరా తీస్తున్నారు. ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌తో సంబంధం లేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు.


ఇదీ చదవండి: Vijayawada police on heroin case: హెరాయిన్‌ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.