ETV Bharat / city

WALL COLLAPSE: కుప్పకూలిన ఇంటిగోడ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

author img

By

Published : Oct 10, 2021, 10:26 PM IST

Five members of the same family died in house wall collapsed
కుప్పకూలిన ఇంటిగోడ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటిగోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదాన్ని నింపింది. ఇంట్లో గదులను వేరు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోడ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్నవారిపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు.. ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం ఇద్దరు పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలున్నా.. అమలు లేకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

కుప్పకూలిన ఇంటిగోడ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో ఇంటి గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన మోష, శాంతమ్మ దంపతులు తమ ఐదుగురు సంతానంతో కలిసి ఓ గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. రోజూలాగే శనివారం రాత్రి ఇంటిలో నిద్రించారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటి గోడలు తడిసి పోయాయి. ఈ క్రమంలో ఇంట్లో గదులను వేరు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోడ అర్ధరాత్రి వారిపై ఒక్కసారిగా కుప్పుకూలింది. ఈ ఘటనలో కుటుంబ యజమాని మోష, అతని భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని అంబులెన్స్​లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం..

కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనా వివరాలు ఆరా తీశారు. మృతులకు ఒక్కొక్కరికి 5లక్షల పరిహారాన్ని ప్రకటించాల్సిందిగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి వాటిల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. విద్య, వైద్యపరంగా సాయం అందిస్తామన్నారు. సమాచారం అందుకున్న అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాన్ని ఆదుకునేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అంతవరకూ పంచనామా చేయనివ్వబోమని అడ్డుకున్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని, 25లక్షల పరిహారంతో పాటు.. ఇల్లు, పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని అబ్రహాం హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ క్రాంతి కూడా ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

పునరావృతమవుతున్న ఘటనలు

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి వాటిని కూల్చివేయాలని, బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శిథిలావస్థకు చేరి ఇళ్లు కూలి జనం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో మట్టిమిద్దె కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృత్యువాత పడ్డారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకులలో మట్టిమిద్దె కూలి సర్పంచ్ లక్ష్మమ్మ, ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారంలో మట్టిమిద్దె కూలిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలి తల్లీకూతురు మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెరలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. గత రెండేళ్లలో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి ప్రాణాలు పోయిన ఘటనలే ఇవన్నీ. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఏటా శిథిలావస్థకు చేరుతున్న ఇళ్లను గుర్తిస్తున్న ఆధికారులు అందులో ఉన్న వారికి పునరావాసం కల్పించడంలో విఫలమవుతున్నారు. ఈ కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

Clash: తేతలిలో అధికార పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పోలీసుల పహారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.