విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా

author img

By

Published : May 2, 2022, 5:41 AM IST

Updated : May 2, 2022, 8:02 AM IST

DRUGS
DRUGS ()

విజయవాడలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. నగరం నుంచి డ్రగ్స్ సరఫరా చేసిన కీలక నిందితుడు గోపిసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ భారతీనగర్‌లోని దుస్తుల పేరుతో కొరియర్‌ సంస్థ నుంచి వెళ్లిన ఓ పార్శిల్‌లో.. నిషేధిత డ్రగ్స్‌ ఉన్నట్లు బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. విజయవాడకు చెందిన ఓ కొరియర్‌ కుర్రాడిని అరెస్టు చేసి విచారించగా..అసలు విషయాలు బయటపడ్డాయి.

బెజవాడ కేంద్రంగా మత్తు పదార్థాల సరఫరా విదేశాలకు చేరుతుంది. పార్శిల్ల రూపంలో జరుగుతున్న డ్రగ్స్‌ దందా.. పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి.. ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 31న విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌ ద్వారా.. ఆస్ట్రేలియాకు ఓ పార్శిల్‌ను కొరియర్‌ చేశాడు. పార్శిల్‌ పంపడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరని కొరియర్‌ సంస్థకు చెందిన గుత్తుల తేజ సూచించాడు. స్పష్టత లేని ఓ ఆధార్‌కార్డు జిరాక్స్‌ను గోపీసాయి ఇచ్చాడు. అది పనికిరాదని, మరొకటి తీసుకురావాలంటూ తేజ చెప్పాడు. తన దగ్గర వేరే కార్డు లేదని, ఎప్పుడూ ఇక్కడి నుంచే కొరియర్‌ చేస్తానని నమ్మబలకడంతో.. తేజ తన ఆధార్‌ కార్డు నంబరుతో కొరియర్‌ను ఆస్ట్రేలియాకు బుక్‌ చేశాడు. కానీ.. పార్శిల్‌ మీద వివరాలు తప్పుగా ఉండడంతో అది కెనడా వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది.

బెంగళూరు విమానాశ్రయంలో ఆ పార్శిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దానిని తనిఖీ చేయగా.. 4.49 కిలోల ఎఫిడ్రిన్‌ అనే మత్తు పదార్థం ఉందని గుర్తించారు. పార్శిల్‌పై ఉన్న ఆధార్‌ కార్డు నంబరు ద్వారా గుత్తుల తేజను గుర్తించిన అధికారులు.. ఏప్రిల్‌ 27న బెంగళూరులో అదుపులోకి తీసుకుని.. 30న అరెస్ట్ చేశారు.

కస్టమ్స్‌ అధికారులు తేజను విచారించగా.. అసలు విషయం బయటకొచ్చింది. నిందితుడ్ని పట్టుకునేందుకు ఆధార్ కార్డ్ ఆధారంగానే ప్రస్తుతం విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ ఖాదర్‌భాషా తెలిపారు. సత్తెనపల్లికి ఒక బృందం, బెంగళూరుకు మరో బృందాన్ని పంపామన్నారు. భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌కు సంబంధించిన హైదరాబాద్‌లోని వరల్డ్‌ ఫస్ట్‌ కొరియర్‌ సంస్థలోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, ఒక బృందాన్ని అక్కడికి పంపామని వెల్లడించారు.

సత్తెనపల్లి వెళ్లిన బృందం.. నిందితుడు గోపిసాయిని అదుపులోకి తీసుకుంది. లక్కరాజు గార్లపాడులో అతని స్వగృహంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న గోపీసాయి... విజయవాడ వచ్చి పార్శిల్ పంపటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా పార్శిల్ పంపమని చెప్పారా?లేక ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విజయవాడ నుంచి పంపాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎఫిడ్రిన్ ను గోపిసాయి ఎక్కడ నుంచి తెచ్చాడు ..ఆస్ట్రేలియాలో ఎవరికి పంపాడు అనే విషయాలు కీలకంగా మారాయి.

భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌ సంస్థ నుంచి గోపీసాయి అంతకుముందు మూడుసార్లు విదేశాలకు పచ్చళ్లు పంపించినట్టు రికార్డులున్నాయి. అప్పుడు కూడా నిజంగా పచ్చళ్లు పంపించాడా, లేక మత్తుపదార్థాలను దర్జాగా కొరియర్‌లో చేరవేశాడా.. అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది.

విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా

ఇదీ చదవండి: తీగ లాగితే కదిలిన డొంక.. రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్​

Last Updated :May 2, 2022, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.