ETV Bharat / city

హస్తకళాకారులకు కరోనా కష్టం

author img

By

Published : Jun 16, 2020, 1:02 PM IST

కరోనా మహమ్మారి హస్తకళలను కూడా కాటు వేసింది. దాదాపు 10 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రయ విక్రయాల్లేక హస్త కళాకారులందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.

corona effect on handicrafts and artisians in telangana
తెలంగాణలో హస్తకళలపై కరోనా కాటు

జీవకళ ఉట్టి పడే వివిధ కళాకృతులను తయారుచేసే హస్త కళాకారులు కరోనా కారణంగా పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది హస్త కళాకారులందరిదీ ఇదే పరిస్థితి. కరీంనగర్‌లోని ఫిలిగ్రి, పెంబర్తి నకాషీ, నిర్మల్‌ కొయ్యబొమ్మలు, కుమురం భీమ్‌ జిల్లాలో డోక్రా, చేర్యాల చిత్రాలు, హైదరాబాద్‌ పాతబస్తీ లోని బిద్రి కళారూపాలను చేతితోనే తయారు చేస్తుంటారు. వీటి తయారీకి ఉపయోగించే కలపతో పాటు ముడి సరకులు, రాగి, ఇత్తడి, వెండి తదితర లోహాల కొనుగోలుకు కళాకారులు భారీగా పెట్టుబడులు అవసరం. అప్పులు చేసి వీటిని కొనుగోలు చేస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తుంటారు.

నిత్యం ఆ రాష్ట్ర హస్తకళల సంస్థ- గోల్కొండకు, వివిధ ప్రభుత్వ శాఖలకు కళాకృతులను విక్రయిస్తుంటారు. స్థానికంగా సహకార సంఘాల ద్వారా దుకాణాల్లో అమ్ముతుంటారు. లాక్‌డౌన్‌ తో సాధారణ ఆర్డర్లు నిలిచిపోయాయి. మార్చిలో లాక్‌డౌన్‌ తర్వాత గోల్కొండ షోరూమ్‌లు మూతపడ్డాయి. దీంతో కళాకారుల ఉత్పత్తుల కొనుగోళ్లు ఆగిపోయాయి. పనులు లేక కార్మికులు మూడు నెలల పాటు విలవిల్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌ మినహా వారికి ఏ ఆదాయం లేదు. ఫలితంగా చాలామంది కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అగచాట్లు పడ్డారు. కొంతమంది కూలి పనులకు వెళ్లారు.

లాక్‌డౌన్‌పై సడలింపుల అనంతరం వెసులుబాట్లు కలిగినా హస్త కళాకారుల జీవితాల్లో చీకట్లు తొలగిపోలేదు. ఇప్పటికీ వారికి ఆర్డర్లు రావడం లేదు. గోల్కొండ దుకాణాలు తెరిచినా అమ్మకాలు మాత్రం అతంత మాత్రమే. హస్తకళాకారులకు సాధారణ పథకాలు మినహా ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందలేదు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వీరికి అవకాశం లభించలేదు. గోల్కొండ సంస్థకు ఆదాయం లేకపోవడంతో ఆదుకోలేకపోతోంది. పింఛను, పీఎఫ్‌ వంటివి కూడా లేక వీరికి ఆసరా లభించడం లేదు.

ఆర్డర్లే రావడం లేదు...

నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల కళ మాది. కరీంనగర్‌లో 150 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం, కార్పొరేటు ఆర్డర్లు లేవు. పెళ్లిళ్లు, కార్యక్రమాలు లేకపోవడం వల్ల పనులు దొరకడం లేదు. హస్తకళలకు ప్రభుత్వం సాయం అందించాలి. -ఎర్రోజు అశోక్‌, కరీంనగర్‌ ఫిలిగ్రీ అధ్యక్షుడు

కరోనా దెబ్బతీసింది

కరోనా కళాకారులను దెబ్బతీసింది. ఎంతో చరిత్ర కలిగిన, అందమైన నిర్మల్‌ బొమ్మలను కొనేవారు లేరు. అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కళాకారుల పరిస్థితులు దీనంగా మారాయి. ప్రభుత్వం ఆదుకుని, తగినన్ని ఆర్డర్లు ఇప్పించాలి. -బీఆర్‌ శంకర్‌, నిర్మల్‌ బొమ్మల సొసైటీ మేనేజర్‌

ఇవీ చూడండి: పదో పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలి : మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.