ETV Bharat / city

Irrigation Projects: నిర్ణీత సమయంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం జగన్

author img

By

Published : Oct 1, 2021, 4:32 PM IST

పోలవరం సహా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. జలవనరులశాఖపై అధికారులతో సమీక్ష (CM Jagan review on irrigation projects) నిర్వహించిన సీఎం..పనులు వేగవంతం చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన డబ్బు రూ.2033 కోట్లను వెంటనే వచ్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించారు. నేరడివద్ద బ్యారేజీ నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్న జగన్..ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.

1
cm-jagan

జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష (CM Jagan review on irrigation projects) నిర్వహించారు. సమీక్షలో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ, ఆర్​అండ్​ఆర్ ‌ తదితర పనులపైనా సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన డబ్బు రూ.2033 కోట్లకు పైనే ఉందని అధికారులు సీఎం వివరించారు. ఆ నిధులు వెంటనే వచ్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని, ఎగువ కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేసి, వచ్చే ఖరీప్‌ నాటికి కాల్వల ద్వారా నీరందిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

ఇతర ప్రాజెక్టుల ప్రగతిపైనా సీఎం జగన్ సమీక్షించారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యాయని, నవంబరులో ప్రారంభోత్సవం చేస్తామని అధికారులు తెలిపారు. అవుకు టన్నెల్​లో ఫాల్ట్‌జోన్‌లో తవ్వకాలు జరిపి..పటిష్ఠపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తిచేసి నీటిని ఇస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్న సీఎం.. పనుల్లో ఆలసత్వం ఉండొద్దన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వంశధార స్టేజ్‌ –2, ఫేజ్‌ –2 పనులన్నింటినీ కలిపి వచ్చే మే నాటికి పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహేంద్రతనయ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం..ఒడిశా ప్రభుత్వం చర్చల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. తోటపల్లి బ్యారేజీ కింద పూర్తిస్థాయిలో వచ్చే ఖరీఫ్‌ నాటికి నీళ్లు ఇచ్చేలా వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు వెంటనే వచ్చేలా చూడాలి. రాష్ట్రం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రియంబర్స్‌ అయ్యేలా చూడాలి. అవుకు టన్నెల్ పనులు వేగవంతం చేయాలి. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ పనుల్లో వేగం పెంచాలి. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలి. ఒడిశాతో చర్చల కోసం తగిన చర్యలు తీసుకోవాలని... తోటపల్లి కింద వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో నీరివ్వాలి. మహేంద్రతనయ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలి. తుపాను, వర్షాల వల్ల దెబ్బతిన్న సాగునీటి కాల్వలను బాగు చేయాలి. కొల్లేరు డెల్టాల్లో రెగ్యులేటర్‌ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. తాండవ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజ్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. -సీఎం జగన్

గులాబ్‌ తుపాను, అనంతర వర్షాల కారణంగా ఎక్కడైనా ఇరిగేషన్‌ కాల్వలు దెబ్బతింటే వాటిని బాగు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాలలో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని.. నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం నిర్దేశించారు. తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలన్నారు. తాండవ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లను పిలిచామన్న అధికారులు, తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్‌ చేసిన పనులకు సంబంధించి మరోసారి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

CM Jagan Kadapa Tour: రేపు సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.