ETV Bharat / city

కదలని మగ్గం... నిండని కడుపులు

author img

By

Published : May 2, 2020, 8:54 AM IST

లాక్ డౌన్ నేపథ్యంలో చేనేత రంగం కుదేలైంది.. లక్షలాది కుటుంబాలు వీధినపడ్డాయి. చేసేందుకు పనిలేక.. ఆదాయ వనరులు లేక.. పస్తులతో కార్మికులు రోజులు వెళ్లదీస్తున్నారు. తాము నేసిన వస్త్రాన్ని విక్రయించుకోలేక.. కుటుంబాన్ని పోషించుకోలేక.. చేనేత కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఉభయ గోదావరి జిల్లాల చేనేత కార్మికుల కష్టాలపై ప్రత్యేక కథనం.

weavers difficulties in godavari disricts due to lockdown
లాక్ డౌన్ తో చేనేత కార్మికుల కష్టాలు

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా రంగాలు దెబ్బ తిన్నాయి. అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగం పూర్తిగా కుంగిపోయింది. చేనేతపైనే ఆధారపడి జీవించే నేతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఏ పూటకు ఆ పూట ఆదాయంతో పొట్టపోసుకొనేవారు.. నలభై రోజులుగా ఆదాయం లేక.. అర్థాకలితో అలమటిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లాక్ డౌన్ వల్ల చేనేత మగ్గాలు మూలనపడ్డాయి. కాస్తో కూస్తో ఇంట్లోనే తయారు చేసిన వస్త్రాలు అమ్ముడుపోలేదు. ముడిసరకు కోసం పెట్టిన పెట్టుబడి వెనక్కురాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. కుటుంబ పోషణ భారంగా మారింది. నేత పనిలో రోజుకు రెండు నుంచి మూడువందల సంపాదించేవారు. ప్రస్తుతం పనిలేక ఆదాయం శూన్యంగా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 50వేల వరకు చేనేత కుటుంబాలు ఉన్నాయి. నరసాపురం, ఏలూరు, యలమంచలి, పాలకొల్లు, అత్తిలి, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో చేనేత మగ్గాలు ఉన్నాయి. ఒక్కో చీర ఆరు వందలకు విక్రయించేవారు. ఖర్చులు పోను.. రెండు వందల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం వస్త్ర దుకాణాల మూత కారణంగా చీరలను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. కాస్తోకూస్తో ఆదాయం ఉన్నవారు..చీరలు తయారు చేసి.. నిల్వ ఉంచుదామన్నా.. ముడిసరుకు కొరత ఏర్పడింది. చీరలు అమ్ముడుపోక.. ఆదాయంలేక.. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేనేత కార్మికులు అంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 7000 వరకు మగ్గాలు ఉన్నాయి. వీటి ఆధారంగా 86 వేల మంది కార్మికుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఆర్డర్లు కరవయ్యాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ముడిసరుకు రాని పరిస్థితి. సాధారణంగా ఉపాధి ఎక్కువగా లభించే ఈ పెళ్లిళ్ల సీజన్ లో కార్మికులకు చేతి నిండా పని ఉంటుంది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో వీరు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

చేనేత రంగంలో వివిధ విభాగాల్లోనూ పలువురు ఉపాధి పొందేవారు. నూలు దారం రాట్నం వడకడం, రంగులు వేయడం, నూలు, సిల్క్ దారం తయారీ నుంచి డైయింగ్, పడుగ వరకు వేల మందికి చేతి నిండా పని ఉండేది. ప్రస్తుతం పైసా ఆదాయం లేక చేనేత కార్మికులు కుంగిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి...రెడ్​జోన్​లో ఆ ఐదు జిల్లాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.