ETV Bharat / city

గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆకస్మిక బదిలీ.. కారణమేంటి?

author img

By

Published : Jun 2, 2021, 6:50 AM IST

గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది. అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా డీజీపీ వద్ద రిపోర్ట్‌ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుమారు ఏడాది పాటు ఆయన ఎస్పీగా పని చేశారు.
guntur urban sp ammireddy sudden transfer
గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఆకస్మిక బదిలీ

గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఐపీఎస్‌ అధికారి, గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్‌ఈబీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న కె.అరీఫ్‌ హాఫీజ్‌ను నియమించింది. అమ్మిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

త్వరలో జరగబోయే ఐపీఎస్‌ల బదిలీల్లో ఆయన్ను మరో కీలకమైన జిల్లాకు ఎస్పీగా పంపిస్తారని ప్రచారం సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు అసలు పోస్టింగే ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించటం చర్చనీయాంశమైంది. ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో అరెస్టై, వైద్యపరీక్షల కోసం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల అమ్మిరెడ్డిపై రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆసుపత్రి నుంచి తనను త్వరగా డిశ్ఛార్జి చేయించేందుకు సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్‌ కేపీరెడ్డి.. తితిదే జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డితో కలిసి కుట్ర చేశారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ, తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే మళ్లీ గుంటూరుకు తీసుకెళ్లటం కోసం ఆసుపత్రి బయట 15 మంది పోలీసుల్ని మోహరింపజేసి అమ్మిరెడ్డి కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఆ 15 మంది పోలీసులకు సంబంధించిన మెస్‌ బిల్లులంటూ కొన్నింటిని ఆ ఫిర్యాదుతో జతపరిచారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే అమ్మిరెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు.

వారంలో ఐపీఎస్‌ల బదిలీలు!

రాష్ట్రంలో మరో వారం రోజుల్లో పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల ఎస్పీలు, రేంజీ డీఐజీలకు స్థానచలనం ఉండనున్నట్లు తెలిసింది. వీరు ఆయా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో వారి స్థానంలో వేరేవారిని నియమించనున్నారు. పోలీసు ప్రధాన కార్యాలయం ఇప్పటికే పలు ప్రతిపాదనలతో జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల ఎస్పీలు ఆ బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్లు పూర్తికావొస్తోంది. ప్రకాశం, రాజమహేంద్రవరం అర్బన్‌, కర్నూలు ఎస్పీలు ఆ స్థానాల్లో కొనసాగుతూ రెండేళ్లు పూర్తయిపోయాయి.

విశాఖపట్నం, కర్నూలు రేంజీ డీఐజీలు ఆ స్థానాల్లో రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా.. అనంతపురం రేంజీ డీఐజీ ఆ బాధ్యతల్లో రెండేళ్లకు పైబడే కొనసాగుతున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన నలుగురికి తాజాగా ఎస్పీలుగా పదోన్నతులు లభించాయి. వారికి జిల్లా ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. 2014 బ్యాచ్‌కు చెందిన కొందరు ఐపీఎస్‌లు ఇప్పటివరకూ ఒక్క జిల్లా ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వహించలేదు. వారికీ పోస్టింగులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో సగానికి పైగా జిల్లాల్లో ఎస్పీలు మారనున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

అలిపిరి - తిరుమల కాలినడక మార్గం మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.