ETV Bharat / city

ఎన్నికల గంట మోగింది...బ్యాలెట్ పెట్టెలకు కొత్తకళ వచ్చింది..!

author img

By

Published : Jan 30, 2021, 9:46 PM IST

ballot-boxes-are-ready-for-elections-in-west-godavari
ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సుల సిద్దం

పంచాయతీ ఎన్నికలంటే ఎంత కోలాహలం ఉంటుందో.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్లను భద్రపరిచే ఎన్నికల పెట్టెల భద్రత విషయంలోనూ యంత్రాంగం అంతకంటే ఎక్కువగా ఆదుర్దా చెందుతుంది. సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల మీట నొక్కగానే ఫలితం ఇట్టే తేలిపోతుంది. పంచాయతీ ఎన్నికల ఆసాంతం ఎంత కోలాహలం ఉంటుందో ఫలితాలు తేలే ఒక్క రోజు అంతకుమించిన ఉత్కంఠ కన్పిస్తుంది.

ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేది మొదలు.. వాటిని లెక్కించే వరకు బ్యాలెట్‌ పెట్టెలను యంత్రాంగం భద్రంగా చూసుకుంటుంది. వీటికి ఏ మాత్రం దెబ్బ తగిలినా.. నీరు ఒంపినా.. ఇంకేం జరిగినా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే కన్పించే బ్యాలెట్‌ పెట్టెలకున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు.. తాజాగా ఎన్నికల జేగంట మోగడంతో మళ్లీ వీటికి కొత్త కళ వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లాలో 893 గ్రామ పంచాయతీలు, 9,660 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 9,991 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైన బ్యాలెట్‌ పెట్టెలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ మేరకు జిల్లాలో 9,624 చిన్న పెట్టెలు, 382 మధ్య తరహావి, 11,464 పెద్ద పెట్టెలు ఉన్నాయి.

ఎక్కడ ఉంటాయంటే..
బ్యాలెట్‌ పెట్టెలను ఏలూరులోని జడ్పీ, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో ఉంటాయి.

సర్దుబాటు చేస్తారిలా..

పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం సిద్ధం చేసిన పెట్టెలను ఆ మేరకు సర్దుబాటు చేయనున్నారు. మొదటి దశలో ఉపయోగించిన వాటిని మూడో దశలో.. రెండోదశలో వినియోగించిన వాటిని నాలుగో దశలో వాడనున్నారు.

ఏడాదికోసారి మరమ్మతులు
ఎన్నికలు నిర్వహించిన తర్వాత వీటిని జడ్పీ, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరుస్తారు. సంబంధిత కార్యాలయాల పరిపాలన అధికారులు వీటి నిర్వహణ బాధ్యత తీసుకుంటారు. ఏటా ఒకసారి వీటిని బయటకు తీసి శుభ్రం చేసి అవసరమైన మరమ్మతులు చేపడతారు.

ఇదీ చదవండి:

సర్పంచి అభ్యర్థి కిడ్నాప్.. అధికార పార్టీ నేతలపై అనుమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.