ETV Bharat / city

'స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుతాం'

author img

By

Published : Aug 15, 2020, 7:40 PM IST

కరోనా వైరస్ ఉద్ధృతి... భారీ వర్షాల మధ్య... రాజధాని రైతులు తమ నిరసనను కొనసాగించారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా... అమరావతినే పరిపాలనా రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వరుసగా 240వ రోజూ ఆందోళనలు చేపట్టారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రాజధాని రైతులు, మహిళలు... స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ప్రకటించారు.

'We will move forward with the spirit of independence movement'
అమరావతి రైతుల ఆందోళన

అమరావతి రైతుల ఆందోళన

రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా తుళ్లూరు ధర్నా శిబిరంలో ఓవైపు నిరసన చేపడుతూనే... స్వాతంత్య్ర వేడుకలనూ ఘనంగా నిర్వహించారు. శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఐకాస నేతలు ఆవిష్కరించారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

అమరావతి రైతుల ఆందోళన

నాడు బ్రిటిష్ దాస్యశృంఖలాలు తెంచుకునేందుకు పోరాడారని.. నేడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని రైతులు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితోనే రాజధాని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని రైతులు, మహిళలు అభిప్రాయపడ్డారు. పైసా తీసుకోకుండానే భూసమీకరణ విధానం ద్వారా ప్రభుత్వానికి భూములు అప్పగించామని... రాష్ట్ర ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధాని మారుస్తారని ఊహించలేదని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆగస్టు 15 ప్రసంగంలోనూ ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రస్తావన తేవడాన్ని రైతులు, మహిళలు నిరసించారు. ఇక్కడ 80 శాతం మంది రైతులు తమ భూములను అమ్మేసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రైతులు ఖండించారు. 90 శాతం భూములు తమ వద్దే ఉన్నాయని.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని రైతులు, మహిళలు వ్యాఖ్యానించారు. ఇది 29 గ్రామాల సమస్య మాత్రమే కాదని... 5 కోట్ల ప్రజల జీవితాలు, భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యగా పేర్కొన్న రైతులు.. 13 జిల్లాల ప్రజలు తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా తమ పోరాటం కొనసాగుతుందని... న్యాయపోరాటాన్ని వీడబోమని రైతులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 8,732 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.