ETV Bharat / city

శ్రీశైలానికి మరమ్మతులు తప్పవు: నిపుణుల కమిటీ

author img

By

Published : Oct 30, 2020, 8:20 AM IST

srisailam dam
శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముందని నిపుణుల కమిటీ సూచించింది. ప్లంజ్‌పూల్‌లో భారీగా గుంతలు ఏర్పడ్డాయని... అవి డ్యాం వైపు విస్తరించే ప్రమాదముందని వారు స్పష్టం చేశారు. మెుత్తం పనులు పూర్తిచేయడానికి రూ.900 కోట్లు అవసరమని సంబంధిత ఇంజినీర్లు అంచనా వేశారు.


శ్రీశైలం డ్యాంకు ప్రత్యేకించి గేట్ల నుంచి విడుదల చేసే నీరు కిందకు పడే ప్రాంతంలో (ప్లంజ్‌పూల్‌)నూ, దిగువన కుడి, ఎడమ గట్ల వైపు భారీగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ సూచించింది. డ్యాం గేట్ల నుంచి నీటిని విడుదల చేసినపుడు కిందపడి మళ్లీ ఎగిరి పడే చోట భారీ గుంతలు ఏర్పడ్డాయని, అవి క్రమేపీ డ్యాం వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. డ్యాం భద్రతకు ఎలాంటి నష్టం లేకుండా ప్లంజ్‌పూల్‌లో గుంతలు పూడ్చటంతో సహా పూర్తి స్థాయిలో అన్ని పనులూ చేయడానికి సుమారు రూ.900 కోట్లు అవసరమని సంబంధిత ఇంజినీర్లు అంచనా వేశారు. 2009లో శ్రీశైలానికి అనూహ్యంగా భారీ వరద వచ్చినపుడు దిగువన రెండు వైపులా దెబ్బతింది. అప్పటి నుంచి పలు కమిటీలు డ్యాంను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా ఛైర్మన్‌గా, రాజగోపాలన్‌, వై.కె.కందా, పి.ఆర్‌.రావు, రౌతు సత్యనారాయణ, సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఏడాది మార్చి ఐదు నుంచి ఏడు వరకు పరిశీలించి డ్యాం భద్రతకు సంబంధించిన పలు అంశాలను గుర్తించింది.

కమిటీ ప్రస్తావనల్లో ముఖ్యాంశాలు...

* ప్లంజ్‌పూల్‌లో ప్రత్యేకించి 6, 8 గేట్ల ఎదురుగా పెద్ద గుంతలు పడ్డాయి. 100 మీటర్లకు పైగా లోతు ఉన్నట్లు గుర్తించాం.

* 2002లో వేసిన కాంక్రీటు కూడా లేచిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించి తక్షణం పట్టించుకోవాలి.

వరద తట్టుకొనే ప్రత్యామ్నాయాలపై కసరత్తు

ఒకవైపు శ్రీశైలం డ్యాం భద్రతా చర్యలు పూర్తి చేస్తూనే భారీ వరద వచ్చినపుడు మళ్లించడానికి అవసరమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కమిటీ సూచించడంతో దీనిపై కసరత్తు చేస్తున్నామని సంబంధిత ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. డ్యాంకు పైభాగంలో ఐదు కిలోమీటర్ల వద్ద మరో స్పిల్‌వే నిర్మించడం, పక్క బేసిన్‌కు వరద మళ్లించేలా కాలువ తవ్వడం లాంటివి ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి. పక్క బేసిన్‌కు మళ్లిస్తే కుందూ నది దీనికి సరిపోదనే అభిప్రాయం కూడా నిపుణుల చర్చల్లో వ్యక్తమైంది.

కేంద్రమూ సాయం చేయాలి

శ్రీశైలం డ్యాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అవసరాలకు సంబంధించినది కాబట్టి మరమ్మతులకు అయ్యే ఖర్చును రెండూ భరించాలని, కేంద్రం కూడా సాయం చేయాలని ఇటీవల కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కోరారు.

ఇదీ చదవండి:

ఏడాదిన్నరగా 'సాగు'తున్న సాగునీటి ప్రాజెక్టులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.