ETV Bharat / city

'మద్యం దుకాణాలు కాదు.. అన్న క్యాంటీన్లు తెరవండి'

author img

By

Published : May 3, 2020, 11:41 AM IST

Updated : May 3, 2020, 1:16 PM IST

'మద్యం దుకాణాలు కాదు.. అన్న క్యాంటీన్లు తెరవండి'
'మద్యం దుకాణాలు కాదు.. అన్న క్యాంటీన్లు తెరవండి'

ప్రపంచమంతా కరోనా నివారణ మందు తయారుచేసే పనిలో ఉంటే... జగన్ మాత్రం మద్యం తయారుచేయించే పనిలో ఉన్నారని తెదేపా నేతలు ఆరోపించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. మద్యం దుకాణాలకు బదులుగా అన్న క్యాంటీన్లు తెరవాలని సూచించారు.

మద్యం బదులు అన్నం పెట్టండి

మద్యం తయారు చేయించే బదులు అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవుపలికారు. పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. పేదలకు పట్టేడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా నివారణ మందు తయారీలో ఉంటే జగన్ మాత్రం తన కమీషన్ల కోసం మద్యం తయారీ చేయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి నిత్యావసర దుకాణాలే మూసేసే పరిస్థితులుంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు.

విపత్కర పరిస్థితుల్లో మద్యం తయారీ చేయాల్సిన అవసరం ఏముందని, మద్యం షాపులు ఏమైనా మెడికల్ షాపులా అని కళా ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కళ్లు గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్న కళా.. జగన్ మాత్రం వారి గురించి పట్టించుకోకుండా తన కమీషన్ల కోసం మద్యం తయారీపై దృష్టి పెట్టడం సరికాదన్నారు.

లాక్​డౌన్​లోనూ మద్యం ఏరులై పారుతోందని కళా వెంకట్రావు విమర్శించారు. వాలంటీర్లు నాటుసారా తయారీ చేయిస్తున్నారని ఆరోపించారు. జగనన్న అమ్మఒడి పథకంలా, జగనన్న నాటుసారాతో నోరుతడి పథకం ఏమైనా రాష్ట్రంలో అమలవుతుందా అని ఎద్దేవాచేశారు. ఏపీకి వెళ్ళొద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుందన్నారు. 5 రూపాయలతో మూడుపూటలా అన్నం పెట్టలేని జగన్ 3 రాజధానులు ఎలా కడతారో దేవుడికే తెలియాలని కళా ధ్వజమెత్తారు.

మద్యం నిత్యావసర సరకా... అత్యవసర సేవా!

వైకాపా నాయకులకు జేటాక్స్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సాకుతో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు వాయిదా వేసి వారి భవిష్యత్తును అంధకారంలో పడేశారని మండిపడ్డారు. పరీక్షలు వాయిదా వేయడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహించలేరా అని ప్రశ్నించారు.

విద్యార్థులకు అండగా నిలిచి విద్యార్థుల్లో మనోధైర్యం నింపే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటని అనగాని ఆక్షేపించారు. ఎప్పటిలోపు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాత్రం మద్యం అమ్మకాలకు సీఎం జగన్ పచ్చజెండా ఊపడం దేనికి సంకేతమన్నారు. మద్యం ఏమన్నా నిత్యావసర సరకా లేక అత్యవసర సేవా అనేది వైకాపా నాయకులు చెప్పాలని అనగాని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సంఘీభావం

Last Updated :May 3, 2020, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.