ETV Bharat / city

ముర్ముకు మద్దతుపైనా వైకాపా చిల్లర రాజకీయం.. తెదేపా ఎంపీల ధ్వజం

author img

By

Published : Jul 16, 2022, 6:55 AM IST

TDP fires on YSRCP: సామాజిక న్యాయం కోసమే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు తెదేపా మద్దతు ప్రకటించిందని, దాన్ని కూడా వైకాపా నాయకులు వక్రీకరించి రాజకీయం చేయడం దిగజారుడుతనమని పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. . తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది. జులై 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు సూచనలు చేశారని ఎంపీలు తెలిపారు.

TDP fires on YSRCP for petty politics over support to presidential candidate Murmu
ముర్ముకు మద్దతుపైనా వైకాపా చిల్లర రాజకీయం.. తెదేపా ఎంపీల ధ్వజం

TDP fires on YSRCP: సామాజిక న్యాయం కోసమే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు తెదేపా మద్దతు ప్రకటించిందని, దాన్ని కూడా వైకాపా నాయకులు వక్రీకరించి రాజకీయం చేయడం దిగజారుడుతనమని పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. దీన్ని సామాజిక దృక్కోణంలో చూడాలన్నారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, కె.రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంపీలు మీడియాకు వివరించారు.

జులై 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు సూచనలు చేశారని తెలిపారు. ‘ద్రౌపదీ ముర్ముకు తెదేపా మద్దతుపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా నాయకులు వ్యాఖ్యానాలు చేయడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనం. ముర్ము వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే. తెదేపాను కించపరచాలన్న ఉద్దేశంతో ఒక ఎస్టీ మహిళను అవమానిస్తున్నారు.

గతంలో కేఆర్‌ నారాయణన్‌, అబ్దుల్‌కలాం, రామ్‌నాథ్‌ కోవింద్‌ విషయంలో అనుసరించిన వైఖరినే ముర్ము విషయంలోనూ పార్టీ కొనసాగించింది’ అని ఎంపీ కనకమేడల తెలిపారు. ‘పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపైనా సమావేశంలో చర్చించాం. ముఖ్యమంత్రి ఆర్థిక అరాచకాల్ని, పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘాలిచ్చిన నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లించడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం. నరేగా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల దారి మళ్లింపును ప్రస్తావిస్తాం’ అని తెలిపారు. ‘సీఎం, మంత్రులు, అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

జగన్‌రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్లాలన్నా హెలికాప్టర్‌ కావాలి. విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమానాలు కావాలి. మంత్రులు, అధికారుల్లో ఎక్కువమంది విలాస జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదాయవ్యయాలు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇది పోలీసుల క్రూరత్వానికి నిదర్శనం: చంద్రబాబు.. పోలీసుల దెబ్బలకే నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు ఉదయగిరి నారాయణ చనిపోయారనే వాదనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో లేదా న్యాయవిచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నారాయణ మరణం పోలీసుల్లోని ఓ వర్గం క్రూరత్వానికి నిదర్శనమని సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు.

జైలుకు పంపుతారని భయం: రామ్మోహన్‌నాయుడు.. ‘కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్‌రెడ్డి.. ప్రధాని మోదీ ఏపీకి వస్తే సెల్ఫీలు తీసుకోవడం తప్ప ఏం చేశారు? జైలుకు పంపుతారని భయమా? ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని గతంలో జగన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ పని ఇప్పుడు వైకాపా ఎంపీలు ఎందుకు చేయడం లేదు?’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు కొండలన్నీ మింగేసి అవినీతికి పాల్పడుతున్నారని.. దీనిపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆధారాలిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.