ETV Bharat / city

Ramappa Temple: రామప్ప ఆలయం కాకతీయుల కళాత్మకత, అద్భుత శిల్పసంపదకు నెలవు

author img

By

Published : Jul 27, 2021, 10:56 AM IST

ramappa temple
ramappa temple

"నేను ఎవరికైనా శత్రువును కావొచ్చు. కానీ ఈ ఆలయం కాదు. దీన్ని ధ్వంసం చేయొద్దు" అని రామప్ప దేవాలయ నిర్మాత రేచర్ల రుద్రుడు ఆలయ శాసనంలో రాసుకున్న మాటలివి. నిజంగా ఆయన రాసుకున్న మాటలు అక్షరసత్యం. ఇప్పడు మనం వాడుతున్నామనే అత్యాధునిక సాంకేతికత... అసలేమాత్రం అందుబాటులో లేని కాకతీయుల కాలంలో ఇంతటి మహోన్నత శిల్పకళా వైభవం తీర్చిదిద్దటం ఎలా సాధ్యమైంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు అందుకున్న రామప్ప దేవాలయ నిర్మాణం వెనుక ఉన్నఆ చరిత్ర ఏమిటి?

రామప్ప ఆలయం కాకతీయుల కళాత్మకత, అద్భుత శిల్పసంపదకు నెలవు

ఎనిమిది శతాబ్దాల నాటి కాకతీయుల కళాత్మకతకు, అద్భుత శిల్ప సంపదకు, చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు రామప్ప దేవాలయం. ఎన్నో ప్రత్యేకతలు... అంతకుమించిన చారిత్రక ఘనత..ఇక్కడికే పరిమితమై పోలేదు రామప్ప దేవాలయం. కాకతీయ రాజలు.. సామంతరాజుల పౌరుషానికి ప్రతీకగా రామప్ప దేవాలయాన్ని భావిస్తారు. 12వ శతాబ్దంలో ఓరుగల్లు కేంద్రంగా...గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. గణపతి దేవుడికి సామంతరాజుగా రేచర్ల రుద్రయ్య ఉండేవాడు. ఈయనకు రుద్రుడు అనే మరో పేరు ఉండేది. కాకతీయుల పౌరుషాన్ని దక్షిణాపథాన ఘనంగా చాటిన గణపతి దేవుడు రాజు కాక ముందు ఓసారి... జైతుగి అనే మహారాష్ట్ర రాజు చేతిలో బందీ అయ్యాడు. అప్పుడు సామంత రాజుల్లో ముఖ్యుడైన రేచర్ల రుద్రయ్య తన పరాక్రమాన్ని చూపించి... గణపతి దేవుడిని విడిపించాడు. అందుకు బహుమానంగా రామప్ప ఆలయాన్ని ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి.

తెలుగు-కన్నడ లిపిలో శాసనం

ఓరుగల్లు తూర్పుభాగాలను పాలించే రేచర్ల రుద్రుడి ఆధ్వర్యంలో... క్రీ.శ.1173లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమాయ్యాయి. సుమారు నలభై ఏళ్ల తర్వాత అంటే క్రీ.శ.1213లో ఆలయ నిర్మాణాలు పూర్తయ్యినట్లు ఆలయంలో నేటికి కనిపిస్తున్న తెలుగు-కన్నడ లిపిలోని శాసనం స్పష్టం చేస్తోంది. ప్రధాన ఆలయంలో... శ్రీ రుద్రేశ్వర స్వామి, కాటేశ్వర, కామేశ్వర స్వాములకు చైత్రమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం ఆదివారంనాడు... ఆలయాల నిర్మాత రేచర్ల రుద్రయ్య తన రాజ్యంలోని కొన్ని గ్రామాలను శాశ్వత ధర్మముగా దానం ఇచ్చినట్లు శాసనం స్పష్టం చేస్తోంది. కాకతీయులు నిర్మాణ శైలి... ఆవాసాలు, గుడి, కొలను అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రామప్ప గుడి కూడా అదే పద్ధతిలో నిర్మించారు. ఆలయం సమీపంలోనే విశాలమైన చెరువు, పాలంపేట గ్రామం ఉన్నాయి.

ఓరుగల్లు సింహాసనంపై గణపతి దేవుడిని నిలిపిన రేచర్ల రుద్రుడు... ‘కాకతీయ సామ్రాజ్య స్థాపనాచార్య’ అనే బిరుదు పొందాడు. రామప్ప ఆలయంలో.... ధృవమూర్తి అయిన రుద్రేశ్వురుడికి... ఆపేరు రేచర్ల రుద్రుడి కారణంగానే వచ్చినట్లు చరిత్రకారులు భావిస్తారు. ఇందుకు నిదర్శనంగా ఈ ఆలయ అంతరాళపు ద్వారం ఉత్తర భాగంలో ‘రేచర్ల రుద్రుని దంపతుల’ విగ్రహం చూడవచ్చు. రేచర్ల రుద్రుడే తన తల్లిదండ్రులు కాటయ, కామాంబల పేరు మీద ప్రధానాలయానికి ఉత్తర దక్షిణ దిశలలో కాటేశ్వర, కామేశ్వర ఆలయాలను కట్టించాడని చెబుతారు.

నంది.. కాకతీయ శైలికే తలమానికం

ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది, మండపంలోని నంది కాకతీయ శైలికే తలమానికంగా పేరు సంపాదించింది. మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి... వాటిని నిర్మించిన ఘనత ఆయా రాజులకే దక్కింది. కానీ ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే ప్రధాన శిల్పి పేరునే... కట్టడానికి పెట్టిన ఘనత రామప్ప దేవాలయానికే దక్కుతుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన రామప్పను ఆలయ నిర్మాణం కోసం ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాన గుడితో పాటు అనుబంధంగా కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపురాలయం వంటి 20 అనుబంధ ఆలయాలు నిర్మించారు. కాకతీయుల సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో ఈ ఆలయం మూతపడింది. తరువాత 600 ఏళ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో 1911లో గుడికి మరమ్మతులు చేశారు.

ప్రధానాలయం నుంచి దక్షిణంగా రామప్ప చెరువు వైపు వెళ్తున్నప్పుడు రోడ్డుకు ఎడమపక్కన పంట పొలాల్లో రెండు మూడు దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. చెరువు గట్టు పైకి ఎక్కగానే మరో రెండు మూడు దేవాలయాలు కన్పిస్తాయి. గట్టుపైన కొంచెం దూరం తూర్పు వైపు నడిచి చెరువు చివరకు చేరుకోగానే మరిన్ని దేవాలయాలు జీర్ణావస్థలో కన్పిస్తాయి. ఈ దేవాలయాల పేర్లేంటి? వీటిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారు? అనే విషయాలు చరిత్రకు అందటం లేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. బహుశా ఇవ్వన్నీ రామప్ప దేవాలయ సమకాలీన కాలంలో కట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.

కాకతీయుల ఘనతకు ప్రతీక

రామప్ప దేవాలయం చరిత్ర, ఆ కళా వైభవం.. అన్నీ కాకతీయుల ఘనతను దశదిశలా చాటాయి. నీటిలో తేలియాడే ఇటుకల దగ్గర నుంచి... సూది మాత్రమే దూరగలిగే స్థాయిలో అతి సూక్ష్మ రంధ్రాలతో తీర్చిదిద్దిన విగ్రహాల వరకూ అణువణువూ కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి, నిర్మాణ కౌశలానికి ప్రతీకలా నిలుస్తుంది. కాకతీయుల రాజ్యాన్ని... శత్రుసేనల నుంచి అనుక్షణం కాచుకున్న రేచర్లరుద్రుడి పౌరుషానికి దర్పణం పడుతుంది. భావితరాలకు తప్పక పరిచయం చేయాల్సిన బాధ్యతను...ఆ కట్టడాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తూ ఉంటుంది.

ఇదీ చూడండి: Ramappa Temple : రామప్ప ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, పర్యాటకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.