ETV Bharat / city

అర్ధాకలితో బిక్కుబిక్కు ....మందుల కొనుగోలుకూ డబ్బుల్లేవ్‌..!

author img

By

Published : May 1, 2020, 6:48 AM IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వారంతా అర్ధాకలితో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాతలిచ్చిన సరకులుతో కాలం వెళ్లదీస్తోన్నారు. ప్రభుత్వం సాయం కోసం వేచిచూస్తున్నారు.

Problems with the disabled people
లాక్​డౌన్ కారణంగా దివ్యాంగుల ఇబ్బందులు

లాక్‌డౌన్‌ ప్రభావం దివ్యాంగుల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వైకల్యం ఉన్నా వెరవకుండా బతుకు పోరాటం చేస్తున్న విధి వంచితులను కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నచిన్న పనులూ దూరమై పూట గడవని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అందించే పింఛను సాయం కుటుంబపోషణకే సరిపోవడం లేదు. అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది దాతలిచ్చే నిత్యావసరాలతో పూట గడుపుతున్నారు. ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నారు.

జేబులో చిల్లి గవ్వ లేదు...

రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది దివ్యాంగులున్నారు. వీరిలో 6.21 లక్షల మంది వరకు ప్రభుత్వ పింఛనును పొందుతున్నారు. కొంత మందికి అర్హత ఉన్నా పింఛను అందడం లేదు. చాలా మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుకాణాల్లోనూ, ఇతరత్రా చోట్ల కూలీ చేస్తూ జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరికి నెల రోజులుగా పని లేక జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఏప్రిల్‌ నెల ఇంటి అద్దె చాలా వరకు చెల్లించలేదు. మే నెల మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్న కోటా బియ్యంతోనే నెల మొత్తం గడిచేలా సర్దుబాటు చేసుకుంటూ అర్ధాకలితో బతుకీడుస్తున్నారు. కొంతమంది బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం ఉన్న వారికి అన్నీ తల్లిదండ్రులే చేయాలి. అవసరమైనవారికి ప్రస్తుతం ఫిజియోథెరపీ అందుబాటులో లేదు. వీరికి మందుల కొనుగోలుకు నెలకు రూ.వేయి నుంచి రూ.4 వేల ఖర్చవుతోంది. మందులు సకాలంలో వేయక విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.

ఇవీ చదవండి..'వలస కూలీల పట్ల కేంద్రం ఆదేశాలు పాటించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.