ETV Bharat / city

విలీన మండలాల్లో వరద కష్టాలు..

author img

By

Published : Jul 25, 2022, 8:10 AM IST

అమ్మా.. ఆకలేస్తోందని బిడ్డ ఏడుస్తున్నా ఓదార్చడం తప్ప కడుపు నింపలేని దీనస్థితిలో తల్లి.. కొండలపై వేసుకున్న గుడారాల్లోకి పాములొచ్చి తమవారిని ఏం చేస్తాయోననే ఆందోళనలో తండ్రి.. ఏళ్లపాటు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న సామగ్రి కళ్లెదుటే గోదారి పాలవుతుంటే కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వృద్ధ దంపతులు.. గోదావరి వరద బాధిత కుటుంబాల దీనగాథ ఇది.

.
.

గోదావరి వరద అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల ప్రజల బతుకులను అతలాకుతలం చేసింది. వరద తీవ్రతను పసిగట్టడంలో అధికార యంత్రాంగం విఫలమవడంతో 4 మండలాలు నామరూపాల్లేకుండా పోయాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో బాధితులు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. రూ.లక్షల విలువైన సామగ్రిని, ప్రాణప్రదంగా పెంచుకుంటున్న మూగజీవాలను వెంట తీసుకెళ్లలేకపోయారు. కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, చింతూరు మండలాల్లో ప్రస్తుతం ఎవరిని కదిపినా కళ్లలో నీరు సుడులు తిరుగుతోంది. పునరావాస కేంద్రం నుంచి తమ ఇంటిని చూసేందుకు వెళ్లిన బాధితులు అక్కడి పరిస్థితిని చూసి విలపిస్తున్నారు. నాలుగు మండలాల్లో 215 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రధాన రహదారులూ మునగడంతో రాకపోకల్లేక నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేక.. పస్తులుండాల్సి వస్తోంది.

.
.

పట్టించుకోని ప్రభుత్వం
వరదలతో విలవిల్లాడుతున్నా అధికారులు, నాయకులు తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం మంచినీరు ఇచ్చే నాథుడు కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పోలవరానికి భూములిచ్చిన తమను త్యాగధనులని జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారని, ఇప్పుడు కనీసం పట్టించుకోలేదని చెబుతున్నారు. ఏటా వరదలతో నష్టపోతున్నామని, తమకు పరిహారం అందిస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని వారంతా ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.

బాధితుల వివరాలు ఇలా..

ముంపునకు గురైన గ్రామాలు: చింతూరు-24, ఎటపాక-40, కూనవరం-78, వరరామచంద్రాపురం-73
నిర్వాసితులు: చింతూరు- 4,429, ఎటపాక-4,699, కూనవరం-26,245, వరరామచంద్రాపురం 25,597 మంది

కట్టుబట్టలతో మిగిలాను

జుతుక సూర్యచంద్రరావు
జుతుక సూర్యచంద్రరావు

ఎన్నికలకు ముందు జగన్‌ మా గ్రామానికి వచ్చి పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన మీరు త్యాగధనులని చెప్పారు. వరదల్లో మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మిని చూసి రెండేళ్లయింది. వరదలతో సర్వం కోల్పోయాం. నాకు వేసుకున్న లుంగీ, షర్టు తప్ప ఇంకేం మిగల్లేదు. ఆగస్టులో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదముంది. ఈలోపు మాకు ప్యాకేజీ ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతాం. - జుతుక సూర్యచంద్రరావు, కూనవరం

ఐదు లక్షల సరకు కోల్పోయాం

మణికుమారి
మణికుమారి

మా దుకాణంలో రూ.5లక్షల విలువైన సరకులు వరదల్లో మునిగిపోయాయి. ఇంట్లోని వస్తువులూ పనికిరాకుండా పోయాయి. వరద సమాచారం సమయానికి ఇవ్వలేదు. దీంతో కట్టుబట్టలతో పునరావాస కేంద్రానికి వెళ్లిపోయాం. - మణికుమారి, బాధితురాలు, చింతూరుఒడ్డు

ఏటా ఇవే ఇబ్బందులు

పద్మశ్రీ
పద్మశ్రీ

వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయాం. ఇంట్లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. ఏ వస్తువూ పనిచేయదు. కూలిపనులు చేసుకుని జీవించే మేము ఈ నష్టం నుంచి కోలుకోవాలంటే జీవితకాలం పడుతుంది. ఏటా వరదలతో ఇబ్బందులు పడుతున్నాం. పోలవరం బాధితులకు ప్రభుత్వం ఏదో ఒక మార్గం చూపాలి. - పద్మశ్రీ, బాధితురాలు, చింతూరు

వాహనాలు సర్వనాశనం

కలహరి
కలహరి

వరదలతో 4 మండలాల్లో వాహనాలన్నీ సర్వనాశనమయ్యాయి. వరదలతో తడిసి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రాణాలతో బయటపడ్డాం. పాముల భయంతో రాత్రిళ్లు మేల్కొని ఉంటున్నాం. - కలహరి, కూనవరం

ఇదీ చదవండి: పోలవరంలో విధ్వంసానికి అసమర్థతే కారణం..!

గుత్తేదారుల మార్పే పోలవరానికి శాపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.