పోలవరంలో విధ్వంసానికి అసమర్థతే కారణం..!

author img

By

Published : Jul 25, 2022, 7:08 AM IST

పోలవరం

‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గ్యాప్‌లు, నదీగర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో పడ్డ గుంతలను పూడ్చకపోవడమే ఇందుకు కారణం. అసమర్థ ప్రణాళికవల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది’ అని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ఈ అంశంపై ఇటీవల తీవ్ర స్థాయిలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ ఐఐటీ బృందం అధ్యయనం చేసి, భారీ వరదలవల్ల ఈ విధ్వంసం జరిగిందనే వాదనను కొట్టిపారేసింది.

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించేచోట 22 మీటర్ల లోతున 150 మీటర్ల వెడల్పున 3 చోట్ల ఏర్పడిన నదీగర్భం కోత.. ప్రాజెక్టు పనులకు సవాలుగా మారిన విషయం తెలిసిందే. ఇలా కోసుకుపోవడానికి భారీ వరద, ప్రకృతి వైపరీత్యమే కారణమని అన్వయిస్తూ వైఫల్యాన్ని ప్రకృతిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు కారణం ప్రకృతి కాదని, మానవ వైఫల్యమేనని హైదరాబాద్‌ ఐఐటీ బృందం తేల్చి చెప్పింది. ఎగువ కాఫర్‌ డ్యాంలో నీరు దిగువకు వెళ్లేందుకు వదిలిన రెండు గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడంవల్లే ఈ విధ్వంసం జరిగిందని కుండ బద్దలుకొట్టింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గల కారణాల్లో ప్రకృతిపరంగా ఎదురైన సవాళ్లను కమిటీ విశ్లేషించింది. మానవమాత్రులు ఏమీ చేయలేని అంశాలను ప్రస్తావిస్తూ కొవిడ్‌ పరిస్థితులను ప్రస్తావించింది. అలాగే గోదావరి నదీ విధ్వంసం, కోత అంశాలను ప్రస్తావించింది.

ఎగువ కాఫర్‌డ్యాం వద్ద ఇసుక కోత తాము అధికారంలోకి రాకముందే ఉందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. 2019 మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2020 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అప్పటివరకూ కూడా... ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఉన్న గ్యాప్‌లను పూడ్చలేదు. ఇదే ప్రధాన డ్యాం వద్ద కోతలకు కారణమైందన్న విషయాన్ని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇటీవల ‘పోలవరంలో ఎవరిదీ వైఫల్యం’ అనే శీర్షికన ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది.

2020లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. 22 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలవల్ల కాఫర్‌ డ్యాం దిగువన, ప్రధాన డ్యాం గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక కోత పడింది. 3 చోట్ల ఇలా నదీగర్భం కోసుకుపోయింది. అయినా దీన్ని మానవుల నియంత్రణలో లేని అంశంగా చేర్చలేం. ఈ విధ్వంసానికి కారణం అసమర్థ ప్రణాళిక. కాఫర్‌ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చలేకపోయారు. అందుకే ప్రధాన డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తికాలేదు - నిపుణుల కమిటీ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.