ETV Bharat / city

ఎటూ తేలని కాళేశ్వర రుణం.. కొనసాగితే తెలంగాణ రాష్ట్ర ఖజానాకే భారం

author img

By

Published : Sep 6, 2022, 12:52 PM IST

Kaleshwaram Project loans : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన రుణంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మొదట కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా ఆర్బీఐ, కేంద్ర విద్యుత్​ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగాలని ఆర్ఈసీ స్పష్టం చేసింది. దీంతో అప్పు వచ్చే అవకాశాలు తక్కువేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.

Kaleshwaram Project
కాళేశ్వరం

Kaleshwaram Project loans : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన రుణంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇదే పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మొదట కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, తాజాగా ఆర్బీఐ, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగాలని రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌.ఇ.సి) స్పష్టం చేసింది. దీంతో ఇక అప్పువచ్చే అవకాశం తక్కువేనన్న అభిప్రాయాన్ని నీటిపారుదల శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.

అదనపు టీఎంసీ పనులపై పడనున్న ప్రభావం : కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా అదనపు టీఎంసీ నీటిని మళ్లించే పనికి అవసరమైన నిధుల కోసం ఆర్‌.ఇ.సి.తో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 2019 జులై 13న రూ.18 వేల కోట్లు, 2020 జూన్‌ నాలుగున మరో రూ.11 వేల కోట్లు కలిపి మొత్తం రూ.29 వేల కోట్ల రుణం ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు రూ.12,700 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కాళేశ్వరం కార్పొరేషన్‌, ఆర్‌.ఇ.సి మధ్య జరిగిన ఒప్పందం కాకుండా రిజర్వ్‌బ్యాంకు, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరగాలని ఆర్‌.ఇ.సి కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. సందిగ్ధత కొనసాగితే రాష్ట్ర ఖజానాపైనే భారం : ఒప్పందం జరిగి కొంతమేరకు నిధులు విడుదల చేసిన తర్వాత ఇలాంటి నిబంధన పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం తప్ప రుణానికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఇక రుణం వచ్చే అవకాశం తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై కూడా నీటిపారుదల శాఖ చర్చించింది. రుణం విడుదలలో జాప్యం కావడం, రాష్ట్ర ఖజనా నుంచి పూర్తి స్థాయిలో చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడే అవకాశం ఉంది.

రూ.8వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు.. గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణ, పునరావాసం, బ్యాంకులు ఇచ్చే రుణాలకు మార్జిన్‌మనీ.. ఇలా అన్నీ కలిపి నీటిపారుదల శాఖ సుమారు రూ.ఎనిమిది వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా గుత్తేదారులు చేసిన పనులకు చెల్లించాల్సినవే రూ.3900 కోట్లు ఉండగా, బ్యాంకులకు మార్జిన్‌మనీ కింద రూ.2500 కోట్లు కట్టాల్సి ఉంది. మార్జిన్‌మనీ మొత్తం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలకు సంబంధించినదే. గత రెండు నెలల్లో బిల్లుల చెల్లింపు కొంత మెరుగుపడినా అనేక ప్రాజెక్టుల్లో నామమాత్రంగానే జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు ఆఖరు వరకు రూ.5480 కోట్లు చెల్లించగా, ఇందులో బ్యాంకుల నుంచి రూ.2760 కోట్లు, రాష్ట్ర ఖజానా నుంచి రూ.2720 కోట్లు చెల్లించారు.

అత్యధికంగా కాళేశ్వరంలో రూ.2720 కోట్లు చెల్లించగా, ఇందులో రూ.2000 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్నవి. కొన్ని పనులకు నాబార్డు రుణం ఇచ్చింది. 80 శాతం నాబార్డు ఇస్తే 20 శాతం మార్జిన్‌మనీ కింద నీటిపారుదల శాఖ చెల్లించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో రూ.980 కోట్లను రాష్ట్ర ఖజనా నుంచి చెల్లించగా, సీతమ్మసాగర్‌లో చెల్లించిన రూ.255 కోట్లు బ్యాంకుల నుంచి ఇచ్చినవే. సీతారామ ఎత్తిపోతలలో రూ.236 కోట్లు బ్యాంకుల ద్వారా, రూ.134 కోట్లు ఖజానా నుంచి చెల్లించారు. ఈ ప్రాజెక్టులో మార్జిన్‌మనీ కింద రూ.735 కోట్ల బకాయి ఉంది. డిండి ఎత్తిపోతలలో రూ.262 కోట్లు, దేవాదులలో రూ.140 కోట్లు, వరదకాలువలో రూ.145 కోట్లు, ఎస్సారెస్పీలో రూ.105 కోట్ల చెల్లింపులు జరగ్గా, మిగిలిన ప్రాజెక్టుల్లో నామమాత్రమే. పెండింగ్‌ బిల్లుల్లో భూసేకరణకు రూ.1425 కోట్లు, పునరావాసానికి రూ.222 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఇవీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.