ETV Bharat / city

మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం

author img

By

Published : Aug 18, 2022, 7:16 PM IST

Updated : Aug 19, 2022, 7:17 AM IST

employees union leaders
minister botsa

Face Recognition App మూడు రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టడంతో మంత్రి బొత్స రంగంలోకి దిగారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. తమ సెల్​ఫోన్లలో యాప్​ డౌన్​లోడ్​ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఫోన్లు ఇవ్వాలని కోరారు. అయితే 15 రోజుల శిక్షణ తర్వాత యాప్​ అమల్లోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.

Minister Botsa Satyanarayana: త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు (ఈ-హాజరు) నమోదు విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని.. ఇందులో భాగంగా మొదట విద్యాశాఖలో దీన్ని అమల్లోకి తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా సెల్‌ఫోన్‌ పాఠశాలకు తీసుకురాలేకపోయినా ఇతరుల ఫోన్లలో హాజరు వేయొచ్చని, సిగ్నల్స్‌ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో హాజరు వేస్తే నెట్‌వర్క్‌ వచ్చిన తర్వాత సర్వర్‌లో నమోదు అవుతుందని హామీ ఇచ్చారు.

యాప్‌ ఆధారిత హాజరు నమోదుపై విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం చర్చలు జరిపారు. అయితే ఇవి అసంపూర్తిగానే ముగిశాయి. సొంత ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌కు సిద్ధంగా లేమని, ప్రభుత్వమే డివైజ్‌లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవు పెట్టాలనే నిబంధన ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. డివైజ్‌లు ఇవ్వలేమని, నిమిషం నిబంధన తొలగిస్తామని, ఈ-హాజరుపై 15 రోజులు శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స హామీ ఇవ్వడంతో క్షేత్రస్థాయి ఉపాధ్యాయులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిర్ణయించారు. ప్రభుత్వమే డివైజ్‌లు కొని ఇవ్వాలంటే సుమారు రూ. 200 కోట్లు అవుతుందని మంత్రి బొత్స తెలిపారు. డివైజ్‌లు రెండేళ్లకే పాడవుతాయని, ప్రతి రెండేళ్లకు రూ. 200 కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాదని మంత్రి పేర్కొన్నారు. యాప్‌ హాజరులో ఏమైనా ఇబ్బందులు వస్తే 28వ తేదీ తర్వాత మరో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ-హాజరుపై ఎలాంటి ఒత్తిడి చేయబోమని వెల్లడించారు.

‘యాప్‌ హాజరు విషయంలో కొంత సమాచార లోపం వచ్చింది. సందేహాలను నివృత్తి చేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, మార్పులు, చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించాను. నిమిషం ఆలస్యమైతే సెలవు పెట్టాలనే నిబంధనను తొలగిస్తాం. మూడుసార్లు ఆలస్యంగా వస్తే సగంరోజు సెలవు కింద పరిగణిస్తాం. రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే లక్ష మంది ఇప్పటికే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.’ - మంత్రి బొత్స సత్యనారాయణ

డివైజ్‌లు ఇవ్వాలన్నదే మా డిమాండ్‌: "సొంత ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, హాజరు వేసేందుకు సిద్ధంగా లేమని చెప్పాం. డివైజ్‌లు ప్రభుత్వమే ఇవ్వాలనే డిమాండ్‌ను కొనసాగిస్తాం. 15 రోజుల తర్వాత సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సిగ్నల్స్‌ లేక నమోదు చేసుకోని వారిపై చర్యలు తీసుకోకూడదని చెప్పాం. అధికారులు ఒత్తిడి చేయడం వల్లే సగంమంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాప్‌ ద్వారా సమస్యలు వస్తే రద్దు చేయాలనే కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తాం. యాప్‌లను రద్దు చేయాలని, బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరాం. విద్యా సంవత్సరం మొదట్లో బోధనేతర పనులు అప్పగించబోమని అధికారులు చెప్పారు.. కానీ, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు." - వెంకటేశ్వర్లు, ఛైర్మన్‌, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)

మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం

ఇవీ చదవండి:

Last Updated :Aug 19, 2022, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.