ETV Bharat / city

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాకే సగం సీట్లు

author img

By

Published : Sep 18, 2020, 5:23 AM IST

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల్లో సగం సీట్లను ఎన్నారై కోటా కింద రూ.15 లక్షల వార్షిక ఫీజుతో భర్తీ చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఐదేళ్లకు రూ.75లక్షలు వసూలు చేయాలని సూచిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో భారీ ఫీజులు చెల్లించలేక.. తక్కువ ఫీజులు ఉంటాయన్న ఉద్దేశంతో కజక్‌స్థాన్‌ వంటి దేశాలకు విద్యార్థులు వెళ్తున్నారు. ఈ తరుణంలో కొత్తగా రానున్న వైద్య కళాశాలల్లో అధికారులు ప్రతిపాదిస్తున్న భారీ ఫీజులు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఈ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో కొన్ని గదులకు, నిర్ధారణ పరీక్షలకూ ఫీజులు వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

medical seats
medical seats

కొత్త వైద్య కళాశాలలు వస్తే ఎక్కువ సీట్లు వచ్చి.. ప్రతిభావంతులు తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్‌ చదివే అవకాశాలు ఉంటాయి. కానీ నిర్వహణ పేరుతో సగం సీట్లను ఎన్నారై కోటా కింద కేటాయించి అధిక ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీల్లో సీట్లు భర్తీచేస్తున్నారు. ‘ఏ’ కేటగిరీలో కన్వీనర్‌ కోటా ఫీజు రూ.12,500, ‘బీ’ కేటగిరీ కింద సుమారు రూ.14 లక్షలు, ‘సీ’ కేటగిరిలో బీ కేటగిరీ ఫీజుకు ఐదింతలు మించకుండా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా మినహా మిగిలిన కేటగిరీలు లేవు.

మొత్తం 1950 సీట్లు?

కొత్తగా వచ్చే 16 వైద్య కళాశాలల్లోని ఏడింట్లో 150 చొప్పున, 9 కళాశాలల్లో 100 చొప్పున కలిపి.. మొత్తం 1950 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎంసీఐ నుంచి అంగీకారం పొందేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో సగం సీట్లను ఎన్నారై కోటాలో రూ.15 లక్షల వార్షిక ఫీజుతో భర్తీచేసే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. ఈ కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు 2021-22 లేదా 2022-23లో ప్రారంభించే అవకాశం ఉంది. మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మదనపల్లి వైద్య కళాశాలల్లో 150 సీట్ల చొప్పున, పాడేరు, గురజాల, పులివెందుల, అమలాపురం, నరసాపురం, బాపట్ల, మార్కాపురం, పెనుకొండ, ఆదోనిలో 100 సీట్లతో కళాశాలలు స్థాపించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త వైద్య కళాశాలల కోసం రూ.8 వేల కోట్ల వరకు అవసరం అవుతుంది.

నిర్ధారణ పరీక్షలకూ ఫీజులు!:

ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వచ్చే రోగులను చూస్తే ప్రభుత్వపరంగా జరిగే చెల్లింపులు, నిర్ధారణ పరీక్షల ఫీజుల కింద కొంత మొత్తం వసూలు చేయాలన్నది అధికారుల ప్రతిపాదనల్లో ఒకటి. స్థలం అందుబాటులో ఉంటే వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇలా చేస్తే ఏడాదికి రూ.1,800 కోట్లు రావొచ్చని భావిస్తున్నారు. మచిలీపట్నం, పాడేరు, గురజాల కళాశాలల ఏర్పాటుకు రూ.585 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.7,158 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2,185 సీట్లు ఉన్నాయి.

ఇవీ చదవండి: భాజపా ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.