ETV Bharat / city

MLC elections : ఆ విధంగా.. కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం!

author img

By

Published : Nov 24, 2021, 3:51 PM IST

నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం కానున్నారు. అఫడవిట్​లో తప్పుల కారణంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్​ను ఎన్నికల అధికారి తిరస్కరించారు.

తెలంగాణలోని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. అఫిడవిట్​లో తప్పుల కారణంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్​ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీలో లేకుండా పోవటంతో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నుంచి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం కానున్నారు.

సోమవారం రోజున తెరాస అభ్యర్థి కవిత నామినేషన్ వేయగా.. ఆమెకు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీల తరఫున కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. సాయంత్రం తర్వాత ఆ నామినేషన్​కు మద్దతిచ్చినట్లు పేర్లున్న ఎంపీటీసీ నవనీత, కార్పొరేటర్ రజియా సుల్తానా.. తాము మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం కలెక్టర్​కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​పై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల మధ్య రిటర్నింగ్ అధికారి.. సదరు నామినేషన్ తిరస్కరించడంతో ఉత్కంఠ వీడిపోయింది.

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్​ 16న నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 16 నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించగా.. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తైంది. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు.. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న.. పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తికానుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.