ETV Bharat / city

Lord Ganesh History బొజ్జగణపయ్యకు 'గణపతి' అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా..?

author img

By

Published : Aug 31, 2022, 10:08 AM IST

Lord Ganesh History : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు బొజ్జగణపయ్యను భక్తిశ్రద్ధలతో చిన్నాపెద్దా అంతా కలిసి పూజిస్తారు. గణపతి, లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, గణేశ్, వినాయకుడు ఇలా గణపయ్యకు ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. ఆ పేర్లు ఎలా వచ్చాయి..? అసలు గణపతి అంటే అర్థం ఏంటో తెలుసుకుందామా..?

Lord Ganesh History
జ్జగణపయ్యకు 'గణపతి' అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా

History and Culture of Lord Ganesh : సమస్త ప్రకృతిలో చరాచరాత్మక సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారో ఆ పరమేశ్వర చైతన్యమే- గణపతి. రూప జగత్తుకు, శబ్ద ప్రపంచానికి గణపతే అధిపతి అని వేదం ప్రకటించింది. ఏ రూపమూ లేని పరబ్రహ్మకు ఆకృతి లభిస్తే ఆ రూపం గణేశుడిగా తేజరిల్లుతుందని ఉపనిషత్తు వాక్కు. గణేశుడిని సూచించే ‘గ’కారమే మంత్ర బీజాక్షరం. సకల దేవతల చేత పూజలందుకొనే గణపతిని వేదం ‘బ్రహ్మణ స్పతి’గా ప్రస్తావించింది. ‘గణం’ అంటే సమూహం. అనేక గణాల మేలు కలయిక అయిన ఈ సృష్టిని నడిపే లోక నాయకుడు గణాధిపుడు! ‘ఓం’కారంలో గణపతి రూపాన్ని దర్శించి, సృష్టి రచనాదక్షతను బ్రహ్మ పొందాడంటారు. అ, ఉ, మ- అనే మూడు అక్షరాల సమ్మిళితమైన ఓంకారాన్ని ఆశ్రయించి గణపతి వెలుగొందుతున్నాడని ముద్గల పురాణం విశ్లేషించింది. ఈ మూడు అక్షరాలు సృష్టి, స్థితి, లయ అనే ప్రక్రియను- జాగృత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను సంకేతిస్తాయి.

శక్తి, యుక్తి, ఐశ్వర్యం, ఆనందం- అనే నాలుగు అంశాల పరిపూర్ణ తత్త్వమే- గణపతి రూపం. గణేశుడి ఏనుగు ముఖం శక్తికి, బలానికి సూచిక. ఆనందమే గణేశుడి రూపం అని శ్రీవిద్యార్ణవ తంత్రం పేర్కొంది. మోదః అంటే ఆనందం. ఆనందకారకమైన మోద కాలను ఆహారంగా శివబాలుడు స్వీకరించి, వాటినే తన భక్తులకు అనుగ్రహ ఫలాలుగా అందిస్తాడు. ప్రకృతీపురుష అభేదాత్మకః గణేశః అని గణేశ పురాణోక్తి. ప్రకృతి ఆకృతే గణపతి. విశ్వమంతా రూపొందక ముందు, నిర్గుణ పరబ్రహ్మగా ఉన్న అవ్యక్త రూపమే- గణపతిగా ఆవిష్కృ తమైంది. ఒక్కటిగా ఉన్నప్పుడు అన్నీ ఆ స్వరూపంలో ఉన్నాయి. విడివడి ప్రపంచంగా రూపాంతరం చెందినప్పుడు అనేక దేవతా శక్తులుగా, గణాలుగా వ్యక్తమయ్యాయి. వేద సంప్రదాయం ప్రకారం మూడు ముఖ్య గణాలున్నాయి. అవి భూమి, అంతరిక్షం, దివి. ఈ మూడు గణాలు గణపతి అధీనంలోనే ఉంటాయి.

ఇంద్రియ ప్రాణాదుల రూపంలో ఈ గణాలు వ్యక్తుల భౌతిక శరీరంలోనూ సమ్మేళనమై ఉంటాయి. ఆ గణాల్ని జాగృతపరచే మహా చైతన్య స్ఫూర్తి- గణపతి. అనేకంగా వ్యాపించి ఉన్న గణాల్ని ఏకోన్ముఖంగా ప్రాణశక్తిగా ఆత్మదీప్తిగా ఎవరు ప్రజ్వలింపజేస్తున్నారో ఆ దివ్య సమ్మోహన రూపమే మహాగణపతి. విష్ణు తేజస్సు, బ్రహ్మ యశస్సు, ఈశ్వరుడి ఓజస్సు ఏకీకృతమై విలసిల్లే విరాట్‌ మంగళమూర్తిగా విశ్వగణపతి ప్రకటితమయ్యాడు.

భాద్రపద శుద్ధ చవితిని అభయ వరద చతుర్థి అంటారు. ఈశ్వర తత్వాన్ని విష్ణునాశక స్వరూపంగా వినాయక చవితినాడు ఆరాధిస్తారు. కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో, అన్ని అవరోధాల్ని అధిగమించడానికి గణేశచతుర్థినాడు విఘ్నేశ్వరారాధన నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. వక్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి- గణేశ్వరుడు. అభ్యుదయంలో, పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. మాయగా అడ్డువచ్చే వక్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు- వరసిద్ధి వినాయకుడు.

యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం- అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన. ఆయన నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి. ఆయన చతుర్భుజుడిగా బీజ, అండ, పిండ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే మహోత్కట గణపతి. చతుర్థినాడు ఉద్భవించిన చిన్మయ చిదానందుడిగా, నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన ‘చవితి దేవర’గా వినాయకుడు ప్రణతులు అందుకుంటున్నాడు. ‘గజ’వదనుడిగా ‘జగ’దానంద తేజోమయ ఆనందరూపుడిగా జయకర, శుభకర వినాయకుడిగా చవితినాడు సాకారమవుతాడు. అనంత సౌభాగ్య సిరుల్ని అనుగ్రహించే ఆహ్లాదపూరితమైన గణేశారాధన పూర్ణత్వమైన ఆనంద యోగసాధన!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.