ETV Bharat / city

రాజధానిపై విచారణ అక్టోబర్​ 5కు వాయిదా

author img

By

Published : Sep 22, 2020, 5:10 AM IST

Updated : Sep 22, 2020, 5:26 AM IST

high court on capital amaravathi petetions
high court on capital amaravathi petetions

రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు అక్టోబర్‌ 5కు వాయిదా వేసింది. అనుబంధ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను భౌతికంగా నిర్వహించాలా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా? అవసరమైతే.. రెండు విధానాల్లో జరపాలా? అనే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ అక్టోబరు 5వ తేదీకి వాయిదా పడింది. అనుబంధ పిటిషన్లపైనా కౌంటరు దాఖలు చేయాలని సోమవారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరికొన్ని వ్యాజ్యాల్లో లేవనెత్తిన తాజా అంశాలపై కౌంటరు వేయాలని, అవసరం లేదనుకుంటే ఇప్పటికే దాఖలు చేసిన కౌంటరును మిగిలిన వ్యాజ్యాలకు అన్వయిస్తూ (అడాప్షన్‌) మెమో వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విచారణను భౌతికంగా నిర్వహించాలా... వీడియో సమావేశం ద్వారా చేపట్టాలా? అవసరాన్ని బట్టి ఆ రెండు విధానాల్లో (హైబ్రీడ్‌) జరపాలా అనే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతికి సంబంధించి కమిటీలు ఇచ్చిన నివేదికలు, శాసనసభ, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడం, తదనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన సుమారు 93 వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. రాజధాని వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఆదేశాలు అమల్లో ఉంటాయని గత విచారణలోనే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ప్రాజెక్టుల స్థాయి నివేదికలివ్వాలి..
యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉండగా విశాఖపట్నంలో గ్రేహౌండ్స్‌ కొండపై ఏపీ రాష్ట్ర వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కౌంటరు దాఖలు చేయలేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది నిదేష్‌ గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘అమరావతిలో అన్ని ప్రాజెక్టుల స్థాయి నివేదికలు సమర్పించేలా అధికారులను ఆదేశించాలి. 2019 జూన్‌ తర్వాత ప్రాజెక్టు పనుల నుంచి ఎంత మంది కాంట్రాక్టర్లను తొలగించారు? 2015 నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసిన వివరాలు సమర్పించేలా ప్రతివాదులను కోరాలి. ప్రభుత్వం తీసుకున్న తాజా విధానపరమైన నిర్ణయంవల్ల ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావం, కలిగిన నష్టంపై నివేదికను సమర్పించేలా డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ను ఆదేశించాలి’ అని ఆయన కోరారు.

అతిథి గృహానికి సంబంధం లేదు: ఏజీ
ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘సీఎస్‌ కౌంటరు సిద్ధంగా ఉంది. త్వరలో వేస్తాం. విశాఖలో నిర్మించే అతిథి గృహానికి కార్యనిర్వాహక రాజధానితో సంబంధం లేదు. అనుబంధ పిటిషన్లపై కౌంటరు వేసేందుకు వారం సమయం కావాలి’ అని పేర్కొన్నారు.

కేంద్రం సమ్మతితోనే పునాది...
మరో పిటిషనరు తరఫున ప్రభునాథ్‌ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రాజధాని అమరావతి కోసం కేంద్రం ఆర్థిక సాయం చేసింది. దేశ ప్రధాని కేంద్రం తరఫున రాజధాని అమరావతికి పునాదిరాయి వేశారు. అంటే కేంద్ర ప్రభుత్వ సమ్మతితోనే రాష్ట్రం పునాది వేసినట్లు భావించాల్సి ఉంటుంది. సుమారు 2 లక్షల మంది ప్రజల సమక్షంలో ప్రధాని అమరావతిని ప్రజా రాజధానిగా వర్ణించారు. కేంద్ర ప్రభుత్వం మీతో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం మౌనం వహించడానికి వీల్లేదు. కేంద్రం, ప్రధానమంత్రి కార్యాలయాల వైఖరి తెలుపుతూ కౌంటర్లు వేయాలి’ అని కోరారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... తప్పనిసరిగా కౌంటరు వేయాలని మేమెలా బలవంతం చేయగలమని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని వ్యాజ్యాల్లో కౌంటరు వేసినట్లు గుర్తు చేసింది. కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఇప్పటికే కొన్ని వ్యాజ్యాల్లో కౌంటరు వేశాం. ఆ కౌంటర్లోని అంశాల్ని మిగిలిన వ్యాజ్యాలకు అన్వయిస్తూ (అడాప్షన్‌) మెమో వేస్తాం. కొత్త అంశాలేమైనా ఉంటే దానిపై స్పందిస్తాం’ అని పేర్కొన్నారు. ఓ పిటిషనరు తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. అకౌంటెంట్‌ జనరల్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. మరో పిటిషనరు తరపున సీనియర్‌ న్యాయవాది ఎమ్మెస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రాజధాని విషయంలో దురుద్దేశంతో వ్యవహరించారని పేర్కొంటూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చామన్నారు. వారు కౌంటర్లు వేయాల్సి ఉందని తెలిపారు. ఇంకో పిటిషనరు తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్‌ విధానం ద్వారా విచారణ జరపాలని కోరారు.

ఇదీ చదవండి: తగ్గిన ఉద్ధృతి...కొత్తగా 6,235 కరోనా కేసులు

Last Updated :Sep 22, 2020, 5:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.