ETV Bharat / city

ఆధారాలు లేకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదు: హైకోర్టు

author img

By

Published : May 17, 2022, 4:38 AM IST

High Court on RTC drivers Drunk and Drive: వైద్య పరీక్షలు చేయకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. మద్యం మత్తులో బస్సును నడుపుతున్నారనే అభియోగంతో ఓ ఆర్టీసీ డ్రైవర్​ను సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పూర్వ ప్రయోజనాలు కల్పిస్తూ.. ఆ డ్రైవర్​ను సర్వీసులోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

AP high court on RTC Drivers Drunk and Drive
AP high court on RTC Drivers Drunk and Drive

మద్యం మత్తులో బస్సును నడుపుతున్నారనే అభియోగంతో, సహచరులు చెప్పిన నోటిమాటల ఆధారంగా ఓ ఆర్టీసీ డ్రైవర్​ను సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పూర్వ ప్రయోజనాలన్ని కల్పిస్తూ.. ఆ డ్రైవర్​ను సర్వీసులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును ఎనిమిది వారాల్లో అమలు చేయాలని ఆర్టీసీ అధికారులకు తేల్చిచెప్పింది. వైద్య పరీక్షలు చేయకుండా మద్యం మత్తును నిర్ధారించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మేనేజరు 2014లో దాఖలు చేసిన అప్పీలు కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది.

2004 జనవరి 3న మద్యం మత్తులో బస్సును నడుపుతున్నాడనే కారణంతో విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించారు. ఆ ఉత్తర్వులను ఇండస్ట్రీయల్ ట్రైబ్యునల్ / కార్మిక కోర్టులో డ్రైవర్ సవాలు చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వైద్య పరీక్షల రిపోర్ట్​ లేకుండా సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పుపట్టారు. డ్రైవర్​ను విధుల్లోకి తీసుకోవాలని 2013 సెప్టెంబర్లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మేనేజరు 2014లో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. దానిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.

బస్సు నడిపే సమయంలో మద్యం ప్రభావితుడై ఉన్నారని సహోద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డ్రైవర్​పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం మద్యం మత్తులో ఉన్నారని చెప్పేందుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఆ వ్యక్తి 100 ఎంఎల్ రక్తంలో 30 ఎంజీకి మించి ఆల్కాహాల్ కలిగి ఉండాలి లేదా డ్రగ్ ప్రభావంతో వాహనంపై తగిన నియంత్రణ కోల్పోయే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారనే అభియోగాలు వర్తిస్థాయి.

ప్రస్తుత కేసులో పిటిషనర్ రక్తంలో 30 ఎంజీకి మించి ఆల్కాహాల్ ఉందని నిరూపించేందుకు ఎలాంటి 'వైద్య సాక్ష్యం' లేదు. ఆయనపై అభియోగాలు నిరూపణ కాలేదు. మత్తు స్థితిలో బస్సును నిర్లక్ష్య ధోరణిలో నడుపుతున్నాడనే విషయాన్ని రుజువు చేసేందుకు తగిన వైద్య సాక్ష్యం అవసరం. అంతేకాని కొంతమంది ప్రయాణికులు, సహ ఉద్యోగులు చెప్పిన నోటిమాట ద్వారా డ్రైవర్​ను సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. ఆ తీర్పుతో మేము ఏకీభవిస్తున్నామని తెలిపింది. ఆ తీర్పును ఎనిమిది వారాల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. విశాఖ డిపో మేనేజర్ దాఖలు చేసిన అప్పీల్​ను ధర్మాసనం కొట్టివేసింది.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్​.. దేశంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఇక వానలే వానలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.